Sunday, July 27, 2025

మూసీని మూసేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

మట్టిపోసి…మూసీని పూడ్చి, దర్జాగా కబ్జా పురానాపూల్ బ్రిడ్జి నుండి
చాదర్‌ఘాట్ బ్రిడ్జి వరకు మూసీలో ఆక్రమణలు షెడ్డు నిర్మించి ట్రాన్స్‌పోర్ట్,
లాజిస్టిక్స్, ఇతరత్రా వ్యాపారాలు వందలాది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల
పార్కింగ్ అధికారుల ప్రేక్షకపాత్రపై సర్వత్రా సందేహాలు

మన తెలంగాణ/గోషామహల్: చారిత్రక మూసీ ప్రక్షాళనకు ఓవైపు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే…మరోవైపు ఆక్రమణదారులు ‘మూసీ’ని మూసేస్తున్నారు. మూసీకి ఉరి బిగించి వందల కోట్ల రూపాయల విలువజేసే భూ మిని చెరపట్టారు. ప్రపంచస్థాయి నిర్మాణాలకు నిలయమైన ఈ ప్రాంతంలో బాహాటంగానే రోజురోజుకూ మట్టి తో మూసేస్తూ దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఈ స్థలంలో ఆక్రమణదారులు అద్దెలకు ఇచ్చి అక్రమంగా లక్షల రూపాయలు దండుకుంటున్నారు. బహిరంగంగా మూ సీని మూసేస్తున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొందరు రాజకీయ ప్రముఖులు…మరికొందరు అధికారుల అండదండలతోనే ఈ కబ్జా తతంగం బహిరంగంగానే సాగుతుందన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఈ ఆక్రమణల పర్వం తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడక పోవడంతో ఆక్రమణదారులు మరింతగా రెచ్చిపోతున్నారు.

నగరంలో స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో కబ్జాదారుల కన్ను మూసీ నదిపై పడింది. ఆలోచన వచ్చిందే తడవుగా మూసీలో మట్టి పోసి పూడ్చేసి, కబ్జా చేసిన మూసీ స్థలంలో అక్రమంగా షెడ్డు నిర్మించి ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారంతో పాటు గోడౌన్‌లు, ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల పార్కింగ్, ఇతరత్రా వ్యాపారాలకు మూసీ స్థలాన్ని అద్దెకిచ్చి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. తమకున్న పలుకుబడితో కొందరు రెవెన్యూ, జిహెచ్‌ఎంసి, విద్యుత్ అధికారులతో కలిసి ఈ కబ్జా తతంగాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. పురానాపూల్ నుండి చాదర్‌ఘాట్ వరకు సుమారు 20 అడుగుల లోతున ఉన్న మూసీ నదిలో వందలాది లారీల మట్టిని పోసి, పూడ్చేసి అక్రమ వ్యాపారాలకు తెర తీశారు.

బడేమియా పెట్రోల్ పంప్ నుండి..
అఫ్జల్‌గంజ్‌లోని బడేమియా పెట్రోల్ పంపు నుంచి చాదర్‌ఘాట్‌లోని ఆంజనేయస్వామి ఆలయం వరకు మూసీ నదిలో ఒకవైపు మట్టితో అక్రమంగా పూడ్చేసి సుమారు 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు. మూసీ నదిని అక్రమంగా ఆక్రమించడంతో పాటు ఆ స్థలాన్ని నర్సరీ, ట్రాన్స్‌పోర్ట్, గోడౌన్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పార్కింగ్‌ల కోసం లీజుకు ఇచ్చి లక్షల్లో సంపాదిస్తున్నారు. అంతేకాకుండా మూసీ నదిలో అక్రమంగా వందలాది గుడిసెలు వేసి కూలీలు, చిత్తు కాగితాలు ఏరుకునే వారికి అద్దెకు ఇచ్చి, వారి నుంచి ప్రతి నెలా అద్దె వసూలు చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. డంపింగ్‌యార్డు పక్కన శివాజీ బ్రిడ్జి కింద స్క్రాప్ దుకాణం నిర్వహిస్తూ, పెద్దఎత్తున పాస్టిక్ కవర్లు, వస్తువులు నిల్వ చేస్తుండటంతో దోమలు పరిసర ప్రాంతాల్లో స్వైరవిహారం చేస్తూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఇక్కడ అక్రమంగా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. మూసీలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న సుమారు వంద కుటుంబాలకు గతంలో ప్రభుత్వం జిల్లెలగూడలో ఇండ్లు నిర్మించి ఇచ్చినా,

ఆ ఇండ్లను ఇతరుల విక్రయించి మళ్లీ ఇక్కడి గుడిసెల్లోనే వారు నివసిస్తున్నారు. మూసీలో కొందరు అక్రమార్కులు ఏర్పాటు చేసిన గుడిసెలకు అక్రమంగా విద్యుత్ వినియోగిస్తూ విద్యుత్ శాఖకు ఆదాయానికి గండి కొడుతున్నట్లు సమాచారం. మూసీలో వందలాది గుడిసెల్లో విద్యుత్ దీపాల వినియోగంతో పాటు ఫ్యాన్‌లు, టివిలు, ఫ్రిడ్జిలతో పాటు ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాల ను వినియోగిస్తూ, భారీగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం పట్ల స్థానికులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు ఎలాంటి సంబంధం లేకుంటే మూసీ నదిలో అక్రమంగా వెలసిన గుడిసెలకు విద్యుత్ కనెక్షన్ ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణదారులు ముందు జాగ్రత్త చర్యగా డంపింగ్ యార్డు వద్ద శివాజీ బ్రిడ్జి కింద, బడేమియా పెట్రోల్ పంపు సమీపంలో, చాదర్‌ఘాట్ బ్రిడ్జి ఆంజనేయస్వామి ఆలయం వద్ద కబ్జా చేసిన మూసీ స్థలాల్లో ఇటీవలే చిన్నపాటి ఆలయాలను నిర్మించారు. ఆలయం ఉన్నందున జిహెచ్‌ఎంసి అధికారులు, హైడ్రా అధికారులు వచ్చి గుడిసెలను నేలమట్టం చేయలేరని భావిస్తున్నట్లు సమాచారం.

ఆక్రమణలు ఇక్కడ.. హైడ్రా ఎక్కడ?
నగరంలోని చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన ఇండ్లు, భవనాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా అధికారులు మూసీ నదినే అక్రమంగా మట్టితో పూడ్చేసినా పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చేపడుతుండగా, ఇక్కడ మూసీనే పూడ్చివేస్తున్నా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజకీయ ఒత్తిడితోనే కబ్జాలవైపు చూడటం లేదని మండిపడుతున్నారు. తక్షణమే స్పందంచి మూసీలో వెలిసిన ఆక్రమణలను కూల్చివేసి మూసీని కాపాడాలని కోరుతున్నారు.

ఆక్రమణల పర్వం వెనక..
తన వద్ద పని చేసే కొంతమందికి మేకలు, ఆవులను పెంచుకునేందుకు వీలుగా మూసీ నదిలో గడ్డి పెంచుకుని, ఉపాధి పొందడం కోసం నిజాం రాజు ఇచ్చిన స్థలాన్ని గడ్డి పెంచేందుకు కాకుండా మట్టితో పూడ్చేసి అక్రమ వ్యాపారాలకు కొంతమంది కబ్జాదారులు వినియోగిస్తున్నారు. అక్రమ సంపాదన కోసం మూసీ నదినే పూడ్చేసిన ఆక్రమణదారులపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మూసీ నది ప్రారంభమైన చోటు నుంచి ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News