Sunday, May 4, 2025

హోలీ పండుగ నాడు ముస్లింలు ఇంటిపట్టునే ఉండండి

- Advertisement -
- Advertisement -

’హోలీ పండుగ నాడు ముస్లింలు ఇంటిపట్టునే ఉండండి’ అని బీహార్‌లోని ఓ బిజెపి ఎంఎల్‌ఏ సోమవారం కోరడం వివాదాస్పదమైంది. ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ దీనిని తీవ్రంగా ఖండించారు. అంతేకాక ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆ శాసనసభ్యుడిని మందలించాలని, అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యేట్లు చూడాలని కోరారు. మధుబనీ జిల్లాలోని బిస్ఫీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎంఎల్‌ఏ హరిభూషణ్ ఠాకుర్ బచౌల్ విధాన సభ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. ‘ఏడాదికి 50 జుమ్మాలు(శుక్రవారం నమాజులు చేసే) చేసే ముస్లింలకు నేను ఓ విన్నపం చేస్తున్నాను.

ఈసారి శుక్రవారం హోలీ పండుగ నాడే(మార్చి 14) వస్తోంది. ఒకవేళ హిందువులు రంగులు పులిమితే వారు బాధ పడకూడదు. ఒకవేళ బాధపడేవారైతే తమ ఇంటిపట్టునే ఉండడం మంచిది. మతసామరస్యాన్ని కాపాడడానికి ఇదే సరైన మార్గం’ అని ఆయన అన్నారు. ఆ బిజెపి వ్యాఖ్యలను తేజస్వీ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ‘ఇదేమి మీ అయ్య సొత్తు కాదు. మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉన్న అతడి వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి’ అని తేజస్వీ అన్నారు. కాగా ‘హోలీ నాడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగవు’ అని మైనారిటీ వ్యవహారాల మంత్రి, జెడి(యు) నాయకుడు జమా ఖాన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News