నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.బుధవారం సాయంత్రానికి 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి ఎన్‌ఎస్పీ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు .ఎగువ ప్రాజెక్టులు జూరాల, సుంకేసుల నుండి భారీ వరద ప్రవాహం కోనసాగుతుండటం, జలాశయాలు పూర్తిగా నిండిఉండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 2,62,912 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం,కుడిగట్టు విద్యుత్ కేంద్రం,9 స్పిల్ వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,18,791 క్యూస్సేక్కుల నీటిని నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు విడుదల చేస్తున్నారు.దీనితో నాగార్జునసాగర్ జలాశయం 26 క్రష్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,01,604 క్యూస్సేక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ ప్రాజెక్టు నీటి సమాచారం
సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 586.70 అడుగులవద్ద నీరు నిల్వవుంది.డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 303.9495 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 33,454 క్యూస్సేక్కుల నీటిని ,కుడి కాలువ ద్వారా 9019 క్యూసెక్కుల నీటిని,ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగడం లేదు , ఎస్.ఎల్.బి.సి 2400 క్యూసెక్కుల నీటిని,లోలేవల్ కెనాల్ ద్వారా 300క్యూస్సేక్కుల నీటిని రిజర్వాయర్ నుండి మొత్తం
2,46,777 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ 26 గేట్లు ఎత్తడంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు బుధవారం పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ఎగువన శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో సాగర్ నిండుకుండలా మారి, ఆహ్లాదం పంచుతోంది. ఇటు గేట్ల నుంచి పాలధారల్లా దూకుతున్న కృష్ణమ్మ కనువిందు చేస్తోంది. మరో దిక్కు సాగర్ సమీపంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం సందర్శకుల మదిని దోచుకుంటోంది. సహజ సుందర జలదృశ్యాన్ని చూడడానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు.