నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో సాగర్ జలాశయం జళకళను సంతరించుకుంది. ప్రస్తుతం డ్యామ్ నిండుకుండలా మారింది. ఈక్రమంలో అధికారులు జలాశయం 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 26 గేట్లలో 8 గేట్లను 10 అడుగులు, 18 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,62,090 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 2,54,784 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా ఔట్‌ఫ్లో 2,96,645 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 588.90 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టిఎంసిలు కాగా ప్రస్తుతానికి 308.7614 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 28,705 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 4050 క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బిసి 1800 క్యూసెక్కుల నీటిని, రిజర్వాయర్ నుండి మొత్తం 2,96,645 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భారీ వర్షంలోనూ కృష్ణమ్మ అందాలను తిలకించడానికి వస్తున్న పర్యాటకులు
ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో సాగర్ వద్ద కనువిందు చేస్తున్న కృష్ణమ్మ సోయగాలను తిలకించేందుకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పర్యాటకులు తరలివస్తున్నారు. క్రస్ట్ గేట్ల మీదుగా జాలువారుతున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకుల తాకిడి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు వస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. క్రస్ట్ గేట్ల మీద నుండి పాలనురుగులా జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో బంధించుకుంటున్నారు. ప్రాజెక్టు వద్ద ఫొటోలు దిగుతూ పర్యాటకులు సందడి చేస్తున్నారు.