మన తెలంగాణ/ బల్మూరు ః నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగసాని యాదవ్(45) హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల జులై 29న జడ్చర్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు కోడేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దాదాపు 22 రోజులుగా దర్యాప్తు చేపట్టారు. తాజాగా బల్మూరు మండలం మైలారం గ్రామ సమీపంలో ఆయనకు హత్య చేసి పాతి పెట్టినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ సంఘటనపై నాగర్‌కర్నూల్ డిఎస్పి, కోడేరు పోలీసులు, అచ్చంపేట, బల్మూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ సంఘటనలో ఏడుగురు ఉన్నారని వారిలో కొందరు అచ్చంపేట ప్రాంతానికి చెందిన వారని సమాచారం అందులో మైలారం గ్రామంలో నివాసముంటున్న పుల్లయ్య గౌడ్ అనే వ్యక్తి ద్వారా రంగసానిని చంపి పాతి పెట్టినట్లు పోలీస్ సమాచారం. పాతి పెట్టినట్లయితే ఆయనను ఎందుకు కిడ్నాప్ చేసి హత్య చేశారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. వ్యాపార సంబంధిత తగాదాలు ఉన్నాయా లేక ఇతర కారణాలున్నాయా అనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని అధికారులు రెవెన్యూ సిబ్బంది సమక్షంలో వెలికి తీసి పంచనామా అనంతరం బంధువులకు అప్పగించనున్నారు. ఈ ఘటనతో మైలారం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మరో వైపు రంగసాని యాదవ్ గుప్త నిధుల కోసం వెళ్లి బలయ్యాడా అన్న ప్రచారం స్థానికంగా వినిపిస్తోంది. పూర్తి వివరాలు తెలిసేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.