Friday, July 25, 2025

నకిలీ విత్తులతో రైతులు చిత్తు

- Advertisement -
- Advertisement -

ప్రతిసారి నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారు. దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు దళారుల చేతిలో మోసపోతు గోసపడుతున్నారు. వానాకాలం ప్రారంభమైతే చాలు దుక్కులన్నీ చదును చేసుకుని, పంట లు వేసుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఇక వారికి కావాల్సింది నాణ్యమైనటువంటి విత్తనాలు. ఈ నాణ్యమైనటువంటి విత్తనాలకోసం వారు వారికి దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేటు ఫర్టిలైజర్స్ షాపులపైన ఆధారపడుతుంటారు.అందులో కొంతమంది నాణ్యమైన విత్తనాలను రైతులకు ఇస్తే, కొంతమంది డబ్బే ప్రధానంగా నకిలీ విత్తనాలను విక్రయిస్తూ సంపాదిస్తున్నారు. ఇటీవల కాలంలో రకరకాల పేర్లతో, రకరకాల కంపెనీలతో నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

వర్షాలు ప్రారంభం కావడంతో నిషేధిత బిటి 3 (లూజ్) విత్తనాల విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నాయి. గ్రామాలకు సంబంధించిన కొంతమంది ఓ ముఠాగా ఏర్పడి చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుండి నకిలీ బీటి 3 విత్తనాలను దిగుమతి చేసి రైతులకు కిలో రూ. 3000 లకు రైతులకు విక్రయిస్తున్నారు. ఇవేకాక రైతులు పెట్టేటువంటి పత్తి, వరి, మొక్కజొన్న, ఇతర పంటలకు సంబంధించిన, కూరగాయల, పండ్ల పంటలకు సంబంధించిన నకిలీ విత్తనాలు మార్కెట్లలో చాలాచోట్ల పట్టుబడుతున్నాయి. నకిలీ విత్తనాలే కాకుండా నకిలీ మందులు కూడా అనేకంగా ఉన్నాయి. పంటపై పిచికారి చేసేందుకు ప్రభుత్వ నిషేధిత గ్లైపోసెట్ మందులు సైతం ముందస్తుగానే సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రతి వానకాలం సీజన్‌లో కొంత మంది ముఠా సభ్యులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలిసినప్పటికీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా ఎరువుల దుకాణాల తనిఖీలు చేస్తున్నామంటూ చేతులు దులుపుకోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నకిలీ బిటి 3 విత్తనాల అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అవి మంచి విత్తనాలను తీసుకొచ్చినటువంటి రైతులు వారి పొలాల్లో నాటి కొద్దిరోజుల తర్వాత పూత ఖాతా రాకపోవడం వల్ల అవి నకిలీ అని గుర్తించి అధికారులకు సమాచారం ఇస్తున్నారు. పంట వేసిన తర్వాత దానికి కొంత పెట్టుబడి కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ నకిలీ విత్తనాలను గుర్తించడానికి రైతులకు అనేక అవగాహన కార్యక్రమాలు పెట్టినప్పటికీ, చదువు లేనటువంటి వారు వాటిని గుర్తించలేకపోతున్నారు.ముందుగా వారు కొనే ప్రతి విత్తనానికి ఫర్టిలైజర్ షాపుల యజమానితో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. విత్తన అనుమతులు పొందిన మంచి కంపెనీల గుర్తింపు పొందిన డీలర్ల నుంచే విత్తనాలు కొనాలి. ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందినటువంటి లైసెన్స్ కలిగినటువంటి డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు తీసుకోవాలి. స్థానికంగా ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, ప్రభుత్వ వ్యవసాయ పనిముట్లు విత్తనాలు విక్రయించేటువంటి వారి వద్ద మాత్రమే విత్తనాలను తీసుకోవాలి.

విత్తనాల బ్యాగును క్షుణ్ణంగా పరిశీలించి, దానిపైన ఉండే హలో గ్రామ్ ఉందో లేదో సరిచూసుకొవాలి. ప్రతి బ్యాగ్‌కు బార్ కోడ్ ఉంటే దాన్ని స్కాన్ చేసినట్లయితే దాని పూర్తి వివరాలు మనకి కనిపిస్తాయి. విత్తన సంచి వెనక స్టిక్కర్ ఉందో లేదో చూసుకోవాలి. ప్రైవేటు కంపెనీల విత్తన సంచుల వెనుక భాగంలో పచ్చరంగు ట్యాగ్ అంటే రూట్ ఫుల్ లేబుల్ అని, లేదా నీలి ట్యాగ్ ఆధారంగా సర్టిఫైడ్ సీడ్ అని గుర్తించాలి. పత్తి, మిరప వంటి విత్తనాలకు పచ్చ ట్యాగ్ ఉండేలా చూసుకోవాలి. ప్రతి ట్యాగ్ పైన లైసెన్స్ లార్డ్ నెంబర్ క్యూఆర్ కోడ్ ఉంటేనే అది నమ్మకమైన విత్తనంగా గుర్తించాలి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ప్యాకింగ్ తేదీ, చెల్లుబాటు గల తేదీలను ముద్రించబడి ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి.

అలా లేని వాటిని కొనొద్దు. ఇవే కాకుండా జీవసాంకేతికతను ఉపయోగించి జన్యు శాతం వంటి ప్రమాణాలు తప్పక మొలక శాతం 80 కంటే ఎక్కువ. జన్యు శాతం 98 కంటే ఎక్కువగా ఉండేలా చూడాలి. ఇలా చూసుకుని ఉన్నప్పుడే రైతులు నకిలి విత్తనాలు నుండి ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారు. లేకపోతే అధిక నష్టం వాటిల్లవచ్చు. అందుకే ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రైవేటు విత్తన విక్రయ కేంద్రాల పైన దాడులు జరిపి అవి మన్నికైనవా కావా అనేటువంటిది చూసుకోవాలి. వాటి తయారీ కేంద్రాలకు వెళ్లి విత్తనాలను పరీక్ష చేయాలి. పకడ్బందీ చర్యలు తీసుకుంటేనే నకిలీ విత్తనాలను అరికట్టవచ్చు. ఆ దిశగా ప్రభుత్వం, వ్యక్తులు పనిచేయాలి.

డా. మోటె చిరంజీవి, 99491 94327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News