సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృషి కేసులో నిందితురాలు డాక్టర్ నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. యూనివర్సల్ సృష్టి ఐవిఎఫ్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత సరోగసి పేరుతో రాజస్థాన్‌కు చెందిన దంపతులను మోసం చేయడంతో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేసిన పోలీసులు డాక్డర్ నమ్రతతోపాటు ఆమెకు సహకరించిన పలువురిని అరెస్టు చేశారు. తర్వాత డాక్టర్ నమ్రత మరో ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్న గోపాలపురం పోలీసులు విచారించి పలు విషయాలు గురించి వివరాలు రాబట్టారు. పిల్లల కోసం తన వద్దకు వచ్చిన దంపతులకు పరీక్షలు నిర్వహించి ఐవిఎఫ్తో పిల్లలు కలగరని మాయమాటలు చెప్పి సరొగసికి ప్రోత్సహించినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
వారి వద్ద నుంచి రూ.20లక్షల నుంచి రూ.30లక్షల వరకు డబ్బులు తీసుకున్నట్లు చెప్పింది. ఇలా డబ్బులు తీసుకుని అబార్షన్ కోసం ఆస్పత్రికి వచ్చిన పేదమహిళలకు డబ్బులు ఆశ చూపించి పిల్లలు కనేలా చేశామని, వారికి పుట్టిన పిల్లలను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి పిల్లలు లేని దంపతులకు వారి పిల్లలుగా చెప్పి ఇచ్చామని చెపింది. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని పిల్లలను కొనుగోలు చేశామని చెప్పింది. పిల్లలను కొనుగోలు చేయడంలో సంతోషి కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ సెంటర్లో డాక్టర్ సదానందం కీలకంగా వ్యవహరించారు. సరోగసికి సంబంధించిన కేసు షీట్లను భద్రంగా దాచినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌కు చెందిన దంపతులను సరోగసి పేరుతో మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత కన్పెషన్లో ఒప్పుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
విజయవాడలో మొదలు…
వైద్య విద్యను అభ్యసించిన తర్వాత డాక్టర్ నమ్రత 1998లో విజయవాడలో మొదటి ఫెర్టిలీటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తర్వాత సికింద్రాబాద్‌లో రెండో బ్రాంచ్, విశాఖపట్టణంలో మూడో బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. సరోగసి పేరుతో మోసం చేయడంతో మహారాణిపేటలో 2020లో కేసు నమోదు చేశారు. తర్వాత విశాఖపట్టణం టౌన్, గోపాలపురం పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదయ్యాయి.