Friday, May 23, 2025

ఒరిగిన విప్లవ శిఖరం

- Advertisement -
- Advertisement -

దండకారణ్యంలో అత్యున్నత సాయిధ పోరాట శిఖరం ధ్వంసమయింది. అది తమ బలగాలు సాధించిన అసాధారణ విజయమని సాక్షాత్తు దేశ ప్రధాని, హోం మంత్రి ప్రకటించారు. ధ్వంసం చేసిన ఆ శిఖరం పేరు నంబాళ్ల కేశవరావు. మారు పేర్లు ఎన్నెన్నో! మారు వేషాలు లేనివాడు. 70 ఏళ్ల జీవితంలో, 45 ఏళ్లు నమ్మిన సిద్ధాంతం కోసం అజ్ఞాతంలోనే బతికినవాడు. మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కావడంవల్ల, ఆ స్థాయి నాయకుడు గతంలో, ఇలా చనిపోలేదు గనుక, దేశాధినేత గర్వంగా చెప్పుకున్నారు. ఇది, ఒక విధంగా కేశవరావు జీవిత విలువను పెంచింది. 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని పూర్తిగా తుడిచిపెట్టడమే ధ్యేయంగా, కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్’ ప్రారంభించింది. ఎదురు కాల్పుల పేరుతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులను చంపేస్తుంది. వారి వ్యూహం ప్రకారం కేశవరావును చంపడం ఘనవిజయమే! అగ్రనాయకుడని హతమార్చిన తర్వాత, పార్టీ ఇక బతకలేదన్న భావన కేంద్ర ప్రభుత్వానికి ఉంది.

అరకు అడవుల నుంచి ప్రారంభమైన కేశవరావు సాయుధ పోరాట జీవితం అబూజ్ ఘడ్‌తో ముగిసింది. నిజానికి, కేశవరావు ఎన్‌కౌంటర్‌లో చనిపోయే సాదాసీదా నాయకుడు కాదు. అతడికి మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అతడు యుద్ధ వ్యూహకర్త. మిలిటరీ ఎత్తుగడల్లో ఆరితేరినవాడు.సంచలనాలను సృష్టించిన దాడులకు రూపకర్త. అజ్ఞాతంగా ఎలా జీవించాలో, ఉద్యమ నాయకులకు పాఠాలుగా చెప్పినవాడు. పార్టీ రెగ్యులర్ దళాలకు సైతం ఎక్కువగా కనిపించేవాడు కాదు. అనేక రాష్ట్రాల అడవులను అధ్యయనం చేసినవాడు. దళాలకు కొత్తదారులను చూపించినవాడు. శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాలి మండలంలోని జియ్యన్నపేటలో 1955లో జన్మించినా, ఇంటర్మీడియట్ వరకు ఈ జిల్లాలోనే చదువుకున్నా, 1968- 70 మధ్య జరిగిన శ్రీకాకుళం గిరిజన, రైతాంగ సాయుధ పోరాట ప్రభావానికి లోను కాలేదు. చదువు, కబడ్డీ, వాలీబాల్ తప్ప మరొక ధ్యాస లేనివాడు. తండ్రి టీచర్. కేశవరావు పుట్టిన తర్వాత కొన్నాళ్లకు తల్లి చనిపోయింది.

తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. బిటెక్ చదవడానికి వరంగల్ వెళ్లిన తర్వాత, రాడికల్ విద్యార్థి సంఘం పరిచయమైంది. కొండపల్లి సీతారామయ్య, కెజి సత్యమూర్తిలతో సంబంధాలు ఏర్పడ్డాయి. అక్కడ ఎబివిపి విద్యార్థి సంఘంతో ఒక గొడవ జరిగి, ఒక విద్యార్థి మరణించినప్పుడు, ఆ కేసులో తొలి నిందితుడిగా, తొలిసారి అరెస్టు అయ్యారు. ఆ తరువాత ఆయన ఏనాడూ, పోలీసులకు దొరకలేదు. ఎంటెక్ చదువుతూ, మధ్యలోనే మానేసి, పీపుల్స్ వార్ ఏర్పాటైన రోజుల్లో, ఆ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. సహజమైన ఉద్వేగం, ఇంజనీరింగ్ విజ్ఞానం కలబోసి ఆయుధాల తయారీలో నిపుణుడయ్యాడు. తొలిసారిగా, అరకు అడవుల్లోకి పార్టీ నాయకత్వం అతన్ని పంపించింది. అవి, కొత్తగా సాయుధ దళాలు ఏర్పడుతున్న రోజులు. బొబ్బిలికి చెందిన గంటి రమేష్ ఒక దళానికి నేతృత్వం వహించేవాడు. అతడు కూడా ఇంజనీరింగ్ విద్యార్థి. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబీకుడు.

ఆ రోజుల్లోనే, కేశవరావు సొంత ఊరు వచ్చి, తన వాటా ఆస్తి కోసం తండ్రిని అడిగాడు. అది ఇస్తే పేదలకు పంచి వెళ్లిపోతానని చెప్పాడు. పిల్లల చదువులకే ఆస్తి ఖర్చుయిపోయిందని, ఇవ్వడానికి ఏమీ లేదని తండ్రి చెప్పేసాడు. కేశవరావు తన ఇంటికి రావడం అదే చివరిసారి. పెళ్లి పట్ల ఆసక్తి లేకుండా, పార్టీ గెరిల్లా దాడుల వ్యూహాల పట్ల నిరంతరం ఆలోచించడం అతనికి ఒక వ్యసనం అయింది. శ్రీలంకలోని ఎల్‌టిటి ఇ నిపుణలతో, బస్తరులో ఒక శిక్షణా శిబిరానికి ఆయన్ని పార్టీ ఎంపిక చేసింది. పేలుడు పదార్థాల తయారీ నుంచి, వాటిని అమర్చి, పేల్చే ప్రక్రియను నేర్చుకొని, తన సొంత జ్ఞానంతో మరింత మెరుగుపరచుకొని, పార్టీలో మిలిటరీ కమాండరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసి, కొన్నాళ్లకు దానికి అతడే నాయకత్వం వహించాడు. అనేక రాష్ట్రాల్లో, అనేక సంచలనమైన దాడులకు అతడే రూపశిల్పి. పార్టీ నాయకత్వం పట్ల అతనికి ఆసక్తి లేకపోయినా, ముప్పాళ్ళ లక్ష్మణరావు (గణపతి) రాజీనామా తరువాత, పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ బాధ్యతలకు ముందే, కొన్ని రాష్ట్రాల, దేశాల్లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు.

వ్యూహాలను పంచుకున్నారు. సరికొత్త ఆయుధాలను పార్టీకి సమకూర్చారు. అతనికి అనేక రహస్య స్థావరాలతో పరిచయాలు ఉన్నాయి. తలుచుకుంటే, దేశం విడిచి వెళ్లగలడు. కానీ, కేడర్ నీరుగారిపోతుందని ఉండిపోయాడు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలు ప్రారంభమైనా, మరికొంత కాలం ఎక్కడో ఒక దగ్గర సురక్షితంగా బతకాలని ఆశ ఆయనకు లేదు. ఎన్ కౌంటర్‌లో అతన్ని హతమార్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా, ఒడిశాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అందిన సమాచారంతో ప్రత్యేక పోలీస్ బలగాలు అదుపులోకి తీసుకొని, అబూజ్ మడ్ అడవుల్లో కాల్చి చంపేశారని ఒక సమాచారం వెలుగులోకి వచ్చింది. మీడియాలో కనిపిస్తున్న ఆయన తలకణత వద్ద బుల్లెట్ గాయం కనిపించడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఏమనుకున్నా అతడి మరణం సత్యం. ఒక యోధున్ని ఉత్తరాంధ్ర, ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా కోల్పోయింది.—

  • నల్లి ధర్మారావు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News