మన తెలంగాణ / గండీడ్: మండలంలోని గండీడ్ గ్రామం పరిధిలో రైతు రామయ్య వరి పొలంలో నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలను మందల వ్యవసాయాధికారి నరేందర్ వివరించారు. ఇందులో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారి మమత, వెంకటయ్య, పరశురాములు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇది అన్ని పంటలకు ఉపయోగపడుతుందని, సురక్షితమై, పర్యావరణ అనుకూలమైన స్థిరమైన వ్యవసాయానికి ఉపయోగపడుతుందని తెలిపారు. దిగుబడిని ప్రభావితం చేయకుండా యూరియా, ఇతర నత్రజని కలిగిన యూరియాను ఆదా చేస్తుందన్నారు. ఎరువుల రవాణా, నిల్వ ఖర్చులు తగ్గుతాయని, రవాణా సులభం అవుతుందన్నారు. రైతు కటికె మల్లోజి వరి పంట సాగును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి నరేందర్ పలు సూచనలు చేశారు.
పొలంలో పంటకు ఎక్కువగా యూరియా వాడడం వల్ల పురుగులు, తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, వరి పంట సాగులో పిలకదశలో కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోపూరాన్ 3జి గుళికను, కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4జి 8కిలోలు, క్లోరాంట్రానిలిఫ్రోల్ 0, 4జి గుళికలు 4 కిలోలు పలుచగా నీటిని కట్టి వేయాలన్నారు. ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలను అమర్చి వారానికి బుట్టకు 25, అంతకుమించి మగ రెక్కలు పురుగులు పండినట్లైతే పురుగు మందులు పిచికారీ చేయాలని, మాస్ ట్రాపింగ్ పద్దతి ప్రకారం ఎకరానికి 8 లింగాకర్షక బుట్టను అమర్చటం ద్వారా ఈ పురుగును నివారించవచ్చని తెలిపారు.