అమరావతి రాజధాని పునర్‌నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని.. వెలగపూడి నుంచి రోడ్ షో ద్వారా అమరావతి సభవేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధానిని సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి.. ఒక్క పాకిస్థాన్ కాదు వంద పాకిస్థాన్‌లు వచ్చినా భారత్ ను ఏమీ చేయలేరన్నారు. వంద పాకిస్థాన్‌లకు సమాధానం చెప్పే మిస్సైల్ మన ప్రధాని మోడీ అని ప్రశంసించారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌కు దిమ్మ తిరగడం ఖాయమన్నారు. ఇక, చంద్రబాబుపై ఉన్న కక్షతోనే గత ప్రభుత్వం అమరావతిని చంపేసిందని విమర్శించారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదని పోరాడారని తెలిపారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికీ లేదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
కాగా, అమరావతి పునర్ నిర్మాణానికి సూచికగా ‘A’ ఆకారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. రూ.58 వేల కోట్లకు పైగా పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.