జాతీయ విమాన యాన దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ఘనంగా జరుపుకుంటారు. మానవ చరిత్రలో అత్యద్భుతమైన విప్లవ ఘట్టాల్లో ఒకటైన గగన యానం సాధనకు గుర్తుగా, విమాన యాన రంగంలో మార్గదర్శకుల కృషిని స్మరించుకునేందుకు ఈ రోజు ప్రత్యేకంగా నిలుస్తుంది. రైట్ బ్రదర్స్ 1903 డిసెంబర్ 17న తొలి విజయవంతమైన యాంత్రిక విమానాన్ని ఆకాశంలో ఎగరవేయడం ద్వారా మానవ కలలకు రెక్కలు వచ్చాయి. ఆర్విల్లే రైట్ జన్మదినం ఆగస్టు 19 కావడంతోనే అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ 1939లో ఈ రోజును విమానయాన దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం సాధించిన పురోగతిని గుర్తు చేసుకుంటూ ఈ రోజును జరుపు కుంటున్నారు. భారతీయ సంస్కృతిలో గగనయాన భావన పూర్వం నుంచే ఉంది.
రామాయణం లోని పుష్పక విమానం, మహాభారతం లోని దివ్య రథాలు మన పూర్వికుల ఊహా శక్తిని ప్రతిబింబిస్తాయి. శాస్త్రీయ యుగంలో (scientific age) ఆ కలలు వాస్తవ రూపం దాల్చాయి. భారత దేశంలో విమానయాన చరిత్ర 1911 ఫిబ్రవరి 18న అలహాబాద్ నుండి నైనికి పంపిన పోస్టల్ మెయిల్తో ప్రారంభమైంది. ఆ తర్వాత 1932 అక్టోబర్ 15న జె.ఆర్.డి. టాటా తన డీహావిలాండ్ పూసా-38 విమానం నడిపి కరాచీ నుండి మద్రాస్ వరకు పోస్టు, ప్రయాణికులను రవాణా చేయడం ద్వారా భారతీయ పౌర విమానయాన రంగానికి నూతన దారులు తీశారు. ఆయన ప్రారంభించిన టాటా ఎయిర్లైన్స్ తరువాత ఎయిర్ ఇండియాగా మారి దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచింది. జె.ఆర్.డి. టాటా అందుకే భారతీయ పౌర విమానయాన పితామహుడిగా చిరస్థాయిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్రం తరువాత భారత ప్రభుత్వం 1953లో ఎయిర్లైన్స్ జాతీయీకరణ చేసి ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్, ఇండియన్ ఎయిర్లైన్స్ను ఏర్పాటు చేసింది.
1990ల ఆర్థిక స్వేచ్ఛా విధానాల తరువాత ప్రైవేట్ రంగానికి అవకాశం లభించడంతో జెట్ ఎయిర్వేస్, సహారా, కింగ్ఫిషర్, స్పైస్ జెట్, ఇండిగో, విస్తారా వంటి విమానయాన సంస్థలు రంగప్రవేశం చేశాయి. ప్రస్తుతం ఇండిగో సంస్థ 60 శాతం మార్కెట్ వాటాతో భారత గగనంలో అగ్ర స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 148 ఆపరేషనల్ విమానాశ్ర యాలు ఉన్నాయనే గణాంకం ఈ రంగం విస్తృతతను తెలియజేస్తుంది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయం, బెంగళూరు కేమ్పేగౌడ, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రపంచస్థాయి సౌకర్యాలను కలిగి దేశ గర్వంగా నిలుస్తున్నాయి. 2017లో ప్రారంభమైన ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాలు, దూరప్రాంతాలు కూడా గగనతల రవాణాతో అను సంధానమవడం సామాన్య ప్రజలకు విమాన ప్రయాణం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 500కి పైగా కొత్త మార్గాలు ప్రారంభమైనట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
రక్షణ రంగంలోనూ విమాన శక్తి భారత భద్రతకు కంచుకోటగా నిలిచింది. 1932లో స్థాపించబడిన భారత వైమానిక దళం స్వాతంత్య్రం తరువాత అనేక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించింది. 1965, 1971 యుద్ధాల్లోనూ, 1999 కార్గిల్ ఘర్షణలోనూ వాయుసేన ప్రదర్శించిన ధైర్య సాహసాలు చరిత్రలో నిలిచి పోయాయి. నేడు టెజాస్ వంటి స్వదేశీ యుద్ధ విమానాలతో పాటు సుఖోయ్-30 ఎంఎంకేఐ, రాఫేల్ వంటి ఆధునిక యంత్రాలు భారత రక్షణ శక్తికి బలాన్నిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనలోనూ విమాన శాస్త్రం పునాదిగా నిలిచింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపకల్పన చేసిన ఉపగ్రహ ప్రయోగాలు, చాంద్రయాన్, మంగళయాన్ విజయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. త్వరలో జరగబోయే గగనయాన్ మిషన్ ద్వారా భారతీయులు అంతరిక్షంలో అడుగు పెట్టబోతున్న సందర్భం విమానయాన దినోత్సవానికి మరింత విశిష్టతనిస్తోంది.
ప్రస్తుతానికి భారతీయ విమానయాన రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. రోజూ మూడు వేలకుపైగా విమానాలు దేశ ఆకాశంలో ఎగురుతున్నాయి. 2024లో 36 కోట్లకుపైగా ప్రయాణికులు విమాన సౌకర్యాలను వినియోగించుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇండిగో ప్రపంచంలోనే అతిపెద్ద A320 నెరోబాడీ విమానాల వాహక సంస్థగా నిలిచింది. 2030 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద విమానయాన మార్కెట్గా మారబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమగ్ర పరిణామ క్రమం మనకు ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇస్తోంది.
జాతీయ విమానయాన దినోత్సవం కేవలం ఒక ఆవిష్కరణ జ్ఞాపక దినం మాత్రమే కాదు. అది మానవ మేధస్సు, ఆవిష్కరణ, ధైర్యసా హసాలకు ప్రతీక. దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ సంబంధాల ను బలపరచడంలో విమానయానం కీలక పాత్ర పోషించింది. సామాన్య పౌరుడికి కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి రావడం సామాజిక ఆర్థిక అభివృద్ధికి పునాదిగా నిలిచింది. జె.ఆర్.డి. టాటా నుంచి నేటి ఆధునిక గగనయాన్ వరకు, భారతదేశం విమానయాన రంగంలో నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఆకాశమే హద్దు అన్న నమ్మకాన్ని మరింత బలపరుస్తూ జాతీయ విమానయాన దినోత్సవం ప్రతి భారతీయునికి గర్వకారణంగా నిలుస్తోంది.
- రామకిష్టయ్య సంగనభట్ల, 94405 95494
- నేడు జాతీయ విమాన దినోత్సవం