Thursday, July 10, 2025

చేపల రైతు చేతుల్లో దేశ ఆహార భద్రత

- Advertisement -
- Advertisement -

ప్రతి సంవత్సరం జులై 10న భారతదేశం జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నది. దేశ ఆహార భద్రతకు, పోషకాహార అవసరాలకు తోడ్పడుతున్న మత్స్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న లక్షలాది చేపల రైతులు, మత్స్యకారులు, ఆక్వా ప్రెన్యూర్ల అంకిత భావానికి, కృషికి గుర్తింపుగా ఈ దినోత్సవం నిర్వహించబడుతున్నది. ఇది కేవలం ఒక రోజు వేడుక మాత్రమే కాకుండా, దేశ మత్స్యపారిశ్రామిక అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ప్రేరణాత్మక దినంగా నిలుస్తోంది. ఈ దినోత్సవాన్ని జులై 10న జరుపు కోవడానికి ఒక ప్రత్యేక నేపథ్యం ఉంది. 1957లో ఇదే తేదీన, ప్రముఖ భారతీయ మత్స్య శాస్త్రవేత్తలు డాక్టర్ హీరాలాల్ చౌదరి, డాక్టర్ కె.హెచ్. అలీ కున్హి ఒడిశాలోని అంగుల్‌లో మేజర్ కార్ప్ చేపలపై హైపోఫిసేషన్ (Hypophysa tion) అనే శాస్త్రీయ సాంకేతికతను విజయవంతంగా ప్రయోగించారు.

ఈ సాంకేతికత ద్వారా చేపల ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ఫలితంగా దేశంలో వాణిజ్య ఆక్వా కల్చర్‌కు బలమైన భూమిక ఏర్పడింది. మత్స్యపాలనలో శాస్త్రీయత, ఉత్పాదకత పెరిగి ‘నీలి విప్లవం’కు నాంది పలికింది. నీలి విప్లవం (Blue revolution) ఫలితంగా భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా నిలిచింది. దేశం మొత్తంలో చేపల ఉత్పత్తిలో సుమారు 65 శాతం వాణిజ్య ఆక్వాకల్చర్ ద్వారానే లభిస్తోంది. 2023- 24 సంవత్సరానికి గాను భారత్‌లో చేపల ఉత్పత్తి సుమారు 174 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, వీటిలో 131 లక్షల మెట్రిక్ టన్నులు ఆక్వాకల్చర్ నుంచి లభించాయి. అంతేకాకుండా, దేశీయ మత్స్య ఉత్పత్తిలో భారత్ వాటా ప్రపంచ స్థాయిలో 8 శాతంగా ఉంది.

ఈ రంగం దాదాపు 2.8 కోట్ల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జీవనాధారంగా మారింది. ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, తెలంగాణ, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోని చేపల ఉత్పత్తిలో దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉంది. సరైన విధానాలు, సాగుకోసం అనుకూల వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో ఈ రాష్ట్రాలు మత్స్య రంగంలో అత్యుత్తమ స్థానాలను ఆక్రమించాయి. కేంద్ర ప్రభుత్వం ‘నీలి విప్లవం’ను మరింత బలోపేతం చేయడానికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్‌వై) వంటి పథకాలను ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా చేపల ఉత్పత్తిని పెంచడమే కాకుండా పోస్ట్-హార్వెస్ట్ మేనేజ్‌మెంట్, శీతల భద్రపరిచే భవనాలు, రవాణా సదుపాయాలు, మార్కెటింగ్ మద్దతు వంటి రంగాల్లో అభివృద్ధికి పునాదులు వేశాయి.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళల పాత్రను పెంచడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. 2023- 24లో పిఎంఎంఎస్ కింద దాదాపు రూ. 2,500 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. నూతన ఆవిష్కరణలతో బయోఫ్లాక్, ఆర్‌సిఆర్‌ఎస్, ఇంటెన్సివ్ కల్చర్ పద్ధతులు రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నీటి వనరుల సమర్థ వినియోగం, ఆరోగ్య సంరక్షణ, చేపల నిర్వహణ వంటి అంశాల్లో శాస్త్రీయ మార్గదర్శకాలు ఇవ్వడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు సాగుతున్నాయి. అయితే, ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా తక్కువ కావు. నీటి కాలుష్యం, సకాలంలో మార్కెట్ మద్దతు లేకపోవడం, సరైన ధరకే విక్రయానికి అవకాశాలు లేకపోవడం, రవాణా లోపాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఇంకా కొనసాగు తున్నాయి.

జలవనరుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు కూడా తక్షణ పరిష్కారం కోరుకుంటున్నాయి. జాతీయ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో అవార్డులు, సన్మానాలు, శిక్షణా శిబిరాలు, ప్రదర్శనలు, సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించడం ద్వారా మత్స్యరంగ అభివృద్ధికి కొత్త దిక్సూచి చూపే ప్రయత్నం జరుగుతోంది. ఈ వేదికల్లో రైతులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు పరస్పరంగా జ్ఞానాన్ని పంచుకుంటూ వ్యవస్థను మెరుగుపరిచే మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ చేపల రైతుల దినోత్సవం కేవలం స్మరణ దినంగా మాత్రమే కాక, మత్స్యరంగానికి విశిష్ట దిశానిర్దేశం చేసే ఒక ఉద్యమంగా మారాలి. ప్రతి నీటి రైతు భారత ఆహార భద్రతకు కాపలాదారుడిగా నిలుస్తున్నాడు. వారి శ్రమకు, అంకిత భావానికి గౌరవం తెలుపడమే ఈ దినోత్సవ అసలైన ఉద్దేశం.

  • రామకిష్టయ్య సంగనభట్ల, 94405 95494
  • నేడు జాతీయ చేపల రైతుల దినోత్సవం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News