భారతదేశం ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించింది. అది జాతీయ ప్రయోజనాలను ముందుంచి, ప్రపంచ శక్తులతో సంబంధాలను నిర్వహిస్తున్నది. అయితే, ఇటీవలి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరించిన విధానాలు ఈ సమతుల్యతను పరీక్షకు గురి చేస్తున్నాయి. ట్రంప్ తన రెండో పదవీకాలంలో భారత్- పాకిస్తాన్ మధ్య సంభవించిన యుద్ధాన్ని తాను అడ్డుకున్నానని పదేపదే చెప్పుకుంటున్నాడు. ఇది భారత్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా తయారయింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలపై స్పందించలేనీ బలహీనతకు పడిపోవడం దేశప్రజలకు ఆశ్చర్యం, విచారాన్ని కలిగించింది. మోడీ మౌనం విపక్షాల విమర్శలకు దారితీసింది. చారిత్రకంగా, భారత్ ‘కశ్మీర్’ లాంటి సున్నితమైన అంశాల్లో కూడా మూడో దేశాల జోక్యాన్ని ఎన్నడూ అంగీకరించలేదు.
1971 ఇండో -పాక్ యుద్ధంలో ఇందిరా గాంధీ అమెరికా ఒత్తిడిని తిరస్కరించి బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని సాధించారు. అలాగే, నెహ్రూ కాలంలో స్వతంత్ర అలీన విధానం ‘కోల్డ్ వార్’ సమయంలో భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సోవియట్ యూనియన్‌తోనూ, అమెరికాతో సమానంగా దౌత్యసంబంధాలు కొనసాగించింది. భారత అవసరాలను, ప్రతిష్ఠను కాపాడింది. ఇప్పుడు, 2025లో ట్రంప్ విధానాలు భారత్‌కు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి. రష్యన్ ఆయిల్ కొనుగోళ్లపై అసంతృప్తితో అమెరికా భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించింది. మొదట 25% ఆగస్టు 1 నుంచి, మరో 25 శాతం అదనంగా 27 నుంచి. ఇది భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
గత ఏడాది భారత్ అమెరికాకు 87 బిలియన్ డాలర్ల వస్తువులను ఎగుమతి చేసింది. ఇందులో 55% భారం ఈ సుంకాల దెబ్బకు గురవుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వస్త్ర పరిశ్రమ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, రసాయనాలు, సముద్ర ఉత్పత్తులు, లేబర్ -ఇంటెన్సివ్ సెక్టార్లు తీవ్రంగా నష్టపోతాయి. క్రిసిల్ రిపోర్టు ప్రకారం మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్, ఎంఇఎస్) 45% ఎగుమతులను నిర్వహిస్తాయి. వీటిలో టెక్స్‌టైల్స్ ఎంఎస్‌ఎంఇ 70% వరకు ఎగుమతులు కోల్పోవచ్చు. ఫలితంగా, భారత జిడిపి గ్రోత్ 0.2 నుంచి 0.6 శాతం తగ్గవచ్చు, నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది. జులై 2025లో నిరుద్యోగ రేటు 5.2 శాతంగా ఉంది. కానీ ఈ సుంకాలు యువతలో నిరాశను పెంచుతాయి.
ముఖ్యంగా ‘ఐటి లే ఆఫ్’, ఎంఎస్‌ఎంఇ మూసివేతల నేపథ్యంలో. ఈ సమస్యలు మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గత 11 ఏళ్లలో బిజెపి పాలనలో విదేశీ సంబంధాలు వ్యక్తిగత బంధాలపై ఎక్కువ ఆధారపడ్డాయి. 2019లో హ్యూస్టన్‌లో ‘హౌడీ మోడీ’, 2020లో గుజరాత్‌లో ‘నమస్తే ట్రంప్’ ర్యాలీలు మోడీ -ట్రంప్ మధ్య స్నేహాన్ని ప్రదర్శించాయి. కానీ, ఇవి దేశప్రయోజనాలకు బదులు బిజెపి పార్టీ ఇమేజ్‌కు మాత్రమే ఉపయోగపడ్డాయి. ఇప్పుడు, రష్యా నుంచి చవకైన ఆయిల్ కొనుగోళ్లు అమెరికాను రెచ్చగొట్టాయి. భారత్ 2024లో రష్యా నుంచి 53 బిలియన్ డాలర్ల ఆయిల్ కొనుగోలు చేసింది. ఇది గ్లోబల్ మార్కెట్ ధరల కంటే 20- 30 శాతం తక్కువ.
అయితే, ఈ లాభాలు సామాన్యులకు ఏమాత్రం చేరలేదు. ముడి ఆయిల్ బ్యారెల్ ధర 80 డాలర్లుగా ఉన్నప్పుడు కూడా పెట్రోల్ లీటరుకు రూ. 110 ఉంది. గత యుపిఎ ప్రభుత్వంలో 150 డాలర్ల ధరకు 60 రూపాయలుగానే ఉండేది. ఈ వ్యత్యాస లాభాలను మోడీ ప్రభుత్వం ప్రైవేట్ రిఫైనరీలు రిలయన్స్, నయారా వంటి కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం భారత ప్రజలను నిలువునా దోచి వాళ్ళ అభివృద్ధి కోసం పంచిపెడుతుందీ అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది మోడీ ప్రభుత్వం వ్యాపార ఆప్తులు అదానీ, అంబానీల కంపెనీలకే లాభాలు తేవటానికి అనుకూలంగా ఉందనే విమర్శలకు దారితీస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాల విదేశాంగ విధానం దీనికి పూర్తి విరుద్ధం. నెహ్రూ అలీనత్వం ద్వారా భారత్‌ను గౌరవప్రదమైన స్థానంలో నిలిపారు. మన్మోహన్ సింగ్ 2008లో అమెరికాతో అణు ఒప్పందం చేసి ఆర్థిక సంస్కరణలు తెచ్చారు.
అప్పుడు రష్యా, అమెరికాతో సమానంగా అశేష ప్రజానీకం అభివృద్ధి కోసమే విదేశాలతో సంబంధాలు కొనసాగాయి.మోడీ పాలనలో మాత్రం పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు పెరిగాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు భారత్‌తో సంబంధాలు చెడిపోయాయి. అవి పూర్తిగా భారత్ పట్ల శత్రుభావనలో ఉన్నాయి. ఇటీవల ట్రంప్ సుంకాలు భారత్‌ను చైనా, రష్యాల వైపు నెట్టాయి. షాంఘై సహకార సంస్థ సమావేశం (ఎస్‌సిఇఒ) మోడీ, -పుతిన్, జీ -జిన్‌పింగ్ సమావేశాలు ఇందుకు సాక్ష్యం. ఇది మల్టీపోలార్ వరల్డ్ భారత్ స్వతంత్రతను చూపుతుంది. కానీ ఇప్పుడు మోడీ అమెరికా ఒత్తిడికి లొంగకుండా ఉండటం కీలకం. ఈ సుంకాలు భారత్‌కు ఒక అవకాశంగా మారవచ్చు.
‘మేక్ ఇన్ ఇండియా’ను బలోపేతం చేసి, డొమెస్టిక్ మార్కెట్‌పై దృష్టిపెట్టాలి. అమెరికా బదులు ఆసియా, ఆఫ్రికా మార్కెట్లను అన్వేషించి, ఎగుమతులను వైవిధ్యపరచాలి. రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను క్రమంగా తగ్గించి, ప్రత్యామ్నాయాలు చూడాలి. ఇది ఇండియా ఆయిల్ బిల్‌ను 9-12 బిలియన్ డాలర్లు పెంచవచ్చు. కానీ దీర్ఘకాలిక స్థిరత్వాన్ని తెస్తుంది. మోడీ ప్రభుత్వం విదేశాంగ విధానాన్ని వ్యక్తిగత ఇమేజ్ నుంచి దేశీయ ఆర్థిక ప్రయోజనాల వైపు మళ్లించాలి. ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారాలంటే, సుంకాల యుద్ధాల నుంచి నేర్చుకుని, సమగ్ర వ్యూహాలు రూపొందించటం అవసరం. ఇది భారత్ స్వతంత్రతను బలోపేతం చేస్తుంది. కానీ పాలకుల అసమర్థత వల్లే దేశాన్ని తాకట్టు పెట్టే స్థితి (దుస్థితి) మన దేశానికి రాకూడదు.
Also Read : బిసి బిల్లులకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది: కెటిఆర్
- డాక్టర్. కోలాహలం రామ్ కిశోర్, 98493 28496