Monday, May 5, 2025

కఠినంగా నీట్ ప్రశ్నాపత్రం

- Advertisement -
- Advertisement -

జెఇఇ అడ్వాన్స్‌డ్ తరహాలో ఫిజిక్స్ ఫ్రశ్నలు
కెమిస్ట్రీ ప్రశ్నలూ కష్టంగానే
ఇంత కఠినంగా ఎప్పుడూ ప్రశ్నలు
రాలేదంటున్న విద్యార్థులు, సబ్జెక్టు నిపుణులు
నీట్‌లో ఈ సారి కటాఫ్ తగ్గే అవకాశం
ప్రశాంతంగా ముగిసిన పరీక్ష
అరగంట ముందే గేట్ల మూసివేత
పలు చోట్ల విద్యార్థులు ఆలస్యంగా
రావడంతో అనుమతించని అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్ : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2025) ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని విద్యార్థులు,నిపుణులు పేర్కొన్నారు. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ యుజి పరీక్ష విధానం అమలులోకి వచ్చిన తర్వాత ప్రశ్నాపత్రం ఇంత కఠినంగా ఎప్పుడూ లేదని నిపుణులు చెబుతున్నారు. ఫిజిక్స్ విభాగం కఠినంగా ఉండగా, కెమిస్ట్రీ విభాగం కొంచెం కష్టంగా ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. జెఇఇ అడ్వాన్స్‌డ్ తరహాలో ఫిజిక్స్ ప్రశ్నలు రావడంతో సమాధానాలు గుర్తించేందుకు సమయం సరిపోలేదని చెప్పారు. బయాలజీ విభాగం కొంత సులభంగా ఉన్నప్పటికీ ప్రశ్నపత్రంలో అన్ని స్థాయిల ప్రశ్నలు సమతుల్యంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తం 720 మార్కులగానూ గత ఏడాది 54 మంది విద్యార్థులకు 720 మార్కులు రాగా, వెయ్యి మందికి పైగా 700 మార్కులు వచ్చాయి. అయితే ఈసారి గరిష్టంగా 680 మార్కులు వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో గత ఏడాది 500 మార్కులు వచ్చిన విద్యార్థులకు కన్వీనర్ కోటాలో ఎంబిబిఎస్ సీటు రాగా, ఈసారి 430 మార్కులు వస్తే సీటు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫిజిక్స్ ప్రశ్నలు కఠినంగా ఉండటం, కెమిస్ట్రీ పేపర్ కూడా కష్టంగా రావడంతో విద్యార్థుల స్కోర్ చాలా తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు.

NEET most toughest question

అలాగే గత ఏడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల్లో చాలామంది 700 పైగా మార్కులు సాధించారు. కానీ, ఈ ఏడాది ఆ సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నీట్ యుజి ప్రశ్నాపత్నం ఉండటంతో మార్కులు గతంలో కంటే తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా నీట్ యుజి పరీక్షను ఇంగ్లీష్, హిందీతో పాటు మరో పదకొండు భాషల్లో అంటే మొత్తం 13 భాషల్లో నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అనుకూలంగా ఉండే తెలుగు, ఉర్దూ భాషల్లోనూ ఈ పరీక్షను నిర్వహించారు. గత ఏడాది 200 ప్రశ్నలకు నీట్ యుజి పరీక్షకు నిర్వహించగా, ఈ ఏడాది మాత్రం మొత్తం 180 ప్రశ్నలకు నీట్ యుజి పరీక్షను నిర్వహించారు. మొత్తం మార్కులు 720 రాగా, ఈసారి గరిష్ట మార్కులు గతంతో పోల్చితే తగ్గే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రశాంతంగా జరిగిన పరీక్ష

దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన నీట్ యుజి పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పెన్ పేపర్(ఆఫ్‌లైన్) విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి వస్తువులు, ఆభరణాలకు అనుమతి ఇవ్వలేదు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా..ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు అనుమతించారు.ఈ ఏడాది దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాల్లో 5,453 పరీక్ష కేంద్రాలతో పాటు విదేశాల్లోని 14 నగరాలలో ఎన్‌టిఎ నీట్ యుజి పరీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో నీట్ యుజి ప్రవేశ పరీక్ష నిర్వహణకు 190 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22.7 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, సుమారు 20.8 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.

ముందుగానే కేంద్రాలకు..

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీట్ యుజి పరీక్షకు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లాలనే నిబంధన ఉండడంతో విద్యార్థులు చాలా వరకు గంటల ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. చెవుల దిద్దులు, కాళ్ల పట్టీలు, షూ, వంటి వాటిని పరిశీలించారు. హాల్‌టికెట్‌లో ఉన్న విద్యార్థి, పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి ఒకరేనా అనే అంశంపై తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.

పలువురు విద్యార్థులకు శాపంగా మారిన కఠిన నిబంధనలు

నీట్ యుజి పరీక్షలో కఠిన నిబంధనలు విధించారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేశారు. విషయాన్ని హాల్ టికెట్లలో ముందుగానే పేర్కొన్నప్పటికీ.. పలువురు విద్యార్థుల పట్ల ఈ నిబంధన శాపంగా మారింది. పరీక్షా కేంద్రాల వద్దకు పలువురు అభ్యర్థులు ఒకటీ రెండు నిముషాల ఆలస్యంగా చేరుకోవడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. కాగా వారు అధికారులను ఎంతగా బతిమాలినప్పటీకి లోపలికి అనుమతించలేదు. ఇలాంటి ఘటన కరీంనగర్‌లో కూడా చోటు చేసుకుంది. వేములవాడకు చెందిన ఓ విద్యార్థిని కరీంనగర్‌లోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో నీట్ పరీక్ష రాసేందుకు తల్లిని వెంటబెట్టుకొని చేరారు. అయితే గేట్లు మూసిన 3 నిముషాల ఆలస్యంగా రావడంతో విద్యార్థిని లోపలికి అనుమతించలేదు. దీంతో తమ కూతురును లోపలికి అనుమతించాలని ఆమె తల్లి అధికారుల కాళ్ళవేళ్ళా పడటం చూసే వారిని కంటతడి పెట్టించింది.

తన బంగారం అమ్మి కూతురికి కోచింగ్ ఇప్పించానని, తన ఒకే ఒక బిడ్డని డాక్టర్‌ను చేయాలనేది తమ కల అని కంటతడి పెట్టుకున్నారు. దయచేసి లోపలికి అనుమతించాలని ఎంత వేడుకున్నా అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం తాము ఏమీ చేయలేమని లోపలికి అనుమతించలేదు.అలాగే కీసర మండలం అంకిరెడ్డిపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల వద్ద గతంలో ఆ భవనంలో కొనసాగిన మూర్తి ఇంజనీరింగ్ కళాశాల చిరునామాను పేర్కొనడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. హాల్ టికెట్‌పై మూర్తి ఇంజనీరింగ్ కళాశాల అని ఉండగా, గూగుల్ మ్యాప్‌లో మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ గురుకుల బాలిక పాఠశాలగా చూపడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. దీంతో కొంతమంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా చేరుకోగా, వారిని సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దాంతో వారు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఈ విషయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారులను నిలదీస్తూ నిరసనకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News