కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులు (Farmers) తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. భూమిపై కౌలు హక్కులు లేకపోవటం వలన ప్రభుత్వ పథకాలకు, పంట నష్ట పరిహారాలకు, సంస్థాగత రుణాలకు దూరమవుతున్నారు. ముఖ్యంగా కౌలు భూమిని పొందటం భూకామందుల ఇష్టాలపై ఆధారపడవలసి వస్తున్నది. భారతదేశం వ్యవసాయిక దేశమని, వ్యవసాయం దేశానికి ఆయువు పట్టని పాలక పార్టీలతోపాటు ప్రతిపక్ష పార్టీలు నిత్యం జపించే మాటలుగా ఉన్నాయి. నేటికీ అత్యధిక ప్రజలకు జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగం పరిస్థితి, వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న కౌలు రైతులు, పేద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం ఎడల పాలక పార్టీలు అనుసరిస్తున్న విధానాలు నేడు దేశంలో, రాష్ట్రంలో చర్చించాల్సిన అంశంగా ఉంది. వ్యవసాయానికి సేద్యపు భూమి పునాదిగా ఉంది. ఆ భూమి సేద్యం చేసే వారి వద్ద ఉందా లేక సేద్యం చేయని వారి వద్ద బందీగా ఉందా అన్నదే కీలక అంశం. ఈ అంశమే వ్యవసాయ రంగం స్వరూపాన్ని తెలియచేస్తుంది. అధికార మార్పిడి జరిగి 77 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా భూసంబందాల్లో మౌలిక మార్పులు జరగలేదు. భూసంస్కరణ చట్టాలు పేదలకు భూములు పంచడంలో విఫలమై అలంకార ప్రాయంగానే ఉన్నాయి. సేద్యం చేసి పంటలు పండించే కౌలురైతుల, పేదరైతులకు సాగు భూమి లేదు. సేద్యం చేయని భూకామందుల వద్ద భూమి కేంద్రీకరణ జరిగింది. ఫలితంగా సేద్యం పై మక్కువ ఉన్న పేదలు భూకామందుల వద్ద భూమిని కౌలుకి తీసుకుని కౌలు దారులుగాను మరి కొందరు కూలీలుగా మారి భూకామందుల దోపిడీకి గురవుతున్నారు.
అధికార మార్పిడి జరిగిన ప్రారంభంలో గ్రామీణ జనాభాలో 35% కౌలు రైతులే (Farmers). కౌలుదారుకి సాగుదారుగా గుర్తింపు లేని పరిస్థితుల్లో దేశంలోని అనేక రాష్ట్రాల్లో హక్కుల కోసం,సేద్యపు భూమి కోసం కౌలు రైతులు, గ్రామీణ పేదలు ఆందోళనా పోరాటాలు చేశారు. ఈ పోరాటాలు కొన్ని ప్రాంతాల్లో మిలిటెంట్ రూపం తీసుకున్నాయి. వాటిల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అతి ముఖ్యమైనది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కౌలుదారీ సంస్కరణలు, భూసంస్కరణలు చేపట్టక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వ కౌలుదారీ సంస్కరణల్లో భాగంగా 1950లో తెలంగాణ కౌలుదారీ చట్టం చేయబడింది. ఈ చట్టానికి ముందు వరుసగా ఆరు సంవత్సరాలు కౌలుదారులుగా ఉన్న వారిని రక్షిత కౌలుదారులుగా గుర్తించి వారికి భూమిపై హక్కులు కల్పించారు. సేద్యపు అవసరాల కోసం భూమిని తనకా పెట్టే హక్కు కూడా చట్టం కల్పించింది. నిబంధనల ప్రకారం కౌలు చెల్లించినంత కాలం కౌలుదారుగా కొనసాగుతాడు. కౌలు దారుకి కల్పించిన హక్కులతోపాటు భూయజమాని సొంత సేద్యం చేసుకునే హక్కు చట్టం కల్పించబడింది. దీన్ని ఉపయోగించుకుని భూకామందులు సొంత సేద్యం పేరుతో భూమి నుంచి కౌలుదారులను తొలగించారు. చివరికి కౌలు విధానం రాత పూర్వకం నుండి నోటి మాటకు మారింది. కౌలు రైతులకు ఎటువంటి హక్కులు లేకుండా పోయాయి. ఆచరణలో కౌలుదారీ చట్టం నిరుపయోగంగా మారింది. 1956లో రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ చట్టం వచ్చింది. దేశంలోని రాష్ట్రాల సరిహద్దులు మారాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒకే రాష్ట్రంగా ఏర్పడింది. 1956 లో ఆంధ్రప్రదేశ్ కౌలుదారీ చట్టం ఆనాటి ప్రభుత్వం చేసింది. ఇది ఆంధ్రా ప్రాంతానికే పరిమితం. తెలంగాణలో 1950 కౌలుదారీ చట్టమే అమల్లో ఉంది. ఉమ్మడి ఎపిలో కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో తెచ్చిన కౌలుదారీ చట్టంలో లైసెన్స్ పొందిన కౌలు రైతులకు సంవత్సర ప్రాతిపదికన అర్హత కార్డులు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణలో అప్పటికి ఉన్న 17.4 లక్షల కౌలు రైతుల్లో 6.8 లక్షల మంది అర్హత కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా 2011- 12లో 5.1 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇచ్చారు. 2012-13లో 4.1 లక్షల మంది కౌలుదారులకే కార్డులు పరిమితమయ్యాయి. ఈ కార్డులు కూడా బ్యాంకుల నుంచి కౌలు రైతులకు పంట రుణాలు అందించలేక పోయాయి. అందుకు కారణం రైతుల అనుమతి పత్రం లేకపోవటమే. ఈ చట్టం కూడా కౌలు రైతులను మభ్యపెట్టి వారి సమస్యలను పక్కదారి పట్టించేందుకు తెచ్చిందే. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన కెసిఆర్ అసలు కౌలు రైతులనే గుర్తించలేదు. ఇది ఫ్యూడల్ అహంకారంనుంచి వచ్చిందే. రేవంతరెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కౌలు రైతుల పరిష్కార విధానాలు చేపట్టలేదు. తెలంగాణలో 2021 -22లో వ్యవసాయ గణాంకాల లెక్కల ప్రకారం 63.12 లక్షల హెక్టార్ల భూవిస్తీర్ణంలో మొత్తం కమతాల సంఖ్య 64 లక్షలు. అందులో దాదాపు 22 లక్షల కమతాలు కౌలు రైతులవే. వారి సాగు చేస్తున్న భూమి 42% గా ఉంది. ప్రతి ముగ్గురు రైతుల్లో ఒకరు కౌలురైతే. 91% కౌలు చెల్లింపు నగదు రూపంలో ఉండగా, 7.5 శాతం పంట రూపంలో చెల్లిస్తున్నారని, 38.3% ఒప్పంద సమయంలోనే పూర్తిగా కౌలు చెల్లిస్తుంటే, 20.5% సగం కౌలు ముందు సగం తర్వాత చెల్లిస్తున్నారని, 41% కౌలు పంట కోతల తర్వాత చెల్లిస్తున్నారని రైతు స్వరాజ్ వేదిక స్టడీ తెలియచేస్తున్నది.
రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య, కౌలు భూమి విస్తీర్ణం నిరంతరం పెరుగుతూ ఉంది. అత్యధిక మంది కౌలుదారులు ముందుగానే కౌలు డబ్బులు చెల్లించి భూమి సాగు చేస్తున్నారు. పంట నష్టపోయిన సందర్భంలో ఎటువంటి సహాయం అందక అప్పుల్లో కూరుకుపోతున్నారు. భూమిని కౌలుకు ఇవ్వటం ప్రోత్సహించాలని ప్రపంచ బ్యాంక్ చెప్పినందుకు భారతదేశ రాష్ట్ర ప్రభుత్వాలు, భూసంస్కరణలు అమలు జరపకుండా భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే వ్యవసాయ విధానాలు రూపొందిస్తున్నారు. దీన్ని సమర్ధించుకోవటానికి చిన్న కమతాల వ్యవసాయం లాభదాయకం కాదని, ఉత్పాదక పెరగదనే ప్రచారం ప్రారంభించారు. వాస్తవంగా చిన్న కమతాల వల్లే ఎక్కువ దిగుబడులు వస్తున్నాయని అనేక సర్వేలు వెల్లడించాయి. మోడీ ప్రభుత్వ సూచనల మేరకు నీతిఆయోగ్ భూమిలేని పేదల వ్యవసాయ సామర్ధ్యం మెరుగు పరచటం కోసమంటూ 2016లో వ్యవసాయ భూమి కౌలుపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగల వ్యవసాయ భూమి లీజింగ్‌పై నమూనా చట్టం రూపొందించింది. ఈ నమూన చట్టంలో ప్రభుత్వ అందించే అన్ని రకాల సహాయాలకు కౌలురైతులు అర్హులు అయ్యే విధంగా చట్టం రూపొందించినట్లు చెప్పింది. యజమానికి పూర్తి భద్రత కల్పిస్తూ, కౌలు రైతుకు భూమిపై ఎటువంటి హక్కు ఉండదని, దీర్ఘకాలికంగా భూమిని కౌలుకు తీసుకున్న వారసత్వంగా భూమిని పొందలేడని, ఎలాంటి సమయంలోనైనా కౌలుదారుని ముందుగా హెచ్చరించి కౌలు రద్దు చేసుకోవచ్చని నమూన చట్టంలో పేర్కొన్నారు. భూపంపిణీ గురించి చట్టంలో ప్రస్తావనే లేదు.
గత కౌలుదారీ చట్టాల్లోనూ, నీతిఆయోగ్ నమూనా చట్టంలో గాని కౌలురైతుకు ఎటువంటి హక్కులు లేవు. భూయజమాని ఇష్టాయిష్టాలపై భూమి కోసం కౌలు రైతు ఆధారపడి ఉండాలి. ఇలాంటి చట్టాలు కౌలు రైతుల సమస్యలు పరిష్కరించవు. మానవ మనుగడకు వ్యవసాయం ప్రధాన జీవనాధారం. అలాంటి వ్యవసాయంలో ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతాంగం పరిస్థితి ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. సేద్యపు ఖర్చులు ఎక్కువ కావటం, అందుకు అనుగుణంగా పంటలకు ధరలు లభించకపోవటం, సంస్థాగత రుణాలు అందక అధిక వడ్డీలకు అప్పులు చేయటం, ప్రభుత్వం ప్రకటించే పరిహారాలు అందకపోవటం వల్ల రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబంపై 1,53,113 ఉండగా, కౌలు రైతు కుటుంబాలు మాత్రం సగటున 2.70 లక్షల రూపాయల అప్పుల్లో ఉన్నారు. ఇందులో రెండు లక్షలు ప్రైవేట్ వ్యక్తుల నుండి అధిక (24% నుండి 60% వరకు) వడ్డీలకు అప్పులు తీసుకున్నారు. రైతుల ఆత్మహత్యల్లో కూడా కౌలు రైతులు సంఖ్య ఎక్కువగానే ఉంది. పాలక ప్రభుత్వాలన్నీ భూస్వామ్య వర్గాల ప్రయోజనాలను కాపాడుతూ పేద, కౌలు రైతుల వ్యతిరేక విధాలు అనుసరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు చేసిన కౌలు చట్టాలన్నీ అందుకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ చట్టాలేవి కౌలు రైతుల సమస్యలు పరిష్కరించలేక పోయాయి. ఈ వాస్తవాన్ని తెలంగాణ కౌలు రైతులు గమనించి సమగ్రమైన కౌలుదారీ చట్టం కోసం గత ఉద్యమాల స్ఫూర్తితో ఉద్యమించాలి.
– బొల్లిముంత సాంబశివరావు
9885983526