ఖాట్మాండు: నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సోమవారం నియమితులైన ముగ్గురు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ ముగ్గురిని కొత్తగా నియమితులైన తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి(73) తన మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. కర్కి నేపాల్ తొలి మహిళా ప్రధానిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆమె కుల్మాన్ ఘీసింగ్, రామేశ్వర్ ఖనాల్, ఓం ప్రకాశ్ ఆర్యల్‌ను మంత్రులుగా చేర్చుకున్నారు. ఇదిలావుండగా ముగ్గురు నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఇక్కడి మహారాజ్‌గంజ్‌లోని శీతల్ నివాస్‌లోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగింది.
ప్రమాణస్వీకారం తర్వాత ఆ ముగ్గురు తమ బాధ్యతలు చేపట్టారు. కుల్మాన్ ఘీసింగ్‌కు మూడు మంత్రిత్వ శాఖలు అప్పగించారు. అవి: ఇంధనం, జనవనరులు నీటిపారుదల, భౌతిక మౌలిక సదుపాయాలు రవాణా, పట్టణాభివృద్ధి. రామేశ్వర్ ఖనాల్ ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తారు. ఓం ప్రకాశ్ ఆర్యల్ హోం వ్యవహారాలు, చట్టం, న్యాయం, పార్లమెంటరీ మంత్రిగా, కార్మిక, ఉపాధి, సమాజిక భద్రతా మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నేపాల్‌లో అవినీతి, సామాజిక మాధ్యమాల నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ‘జన్ జెడ్’ గ్రూప్ చేసిన ఆందోళనలో కనీసం 72 మంది చనిపోయారు.. ప్రధాని కె.పి.శర్మ ఓలి పదవీచ్యుతుడయ్యారు.