Saturday, September 13, 2025

వచ్చే ఏడాది మార్చి 5న నేపాల్ పార్లమెంట్ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

ఖాట్మండూ: నేపాల్‌లో తదుపరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి 5న జరుగుతాయని అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కార్యాలయం వెల్లడించింది. శుక్రవారం కొత్తగా నియామకమైన ప్రధాని సుశీలా కర్కి సిఫార్సుపై ప్రజా ప్రతినిధుల సభను రద్దు చేసిన తరువాత అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఎన్నికల తేదీని ప్రకటించారు. యువత ఆందోళనల ఫలితంగా ప్రధాని పదవికి ఒలి రాజీనామా చేసిన తరువాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని పరిష్కరించడానికి 73 ఏళ్ల మాజీ చీఫ్ జస్టిస్ కర్కి తాత్కాలిక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం నాడు చిన్నపాటి కేబినెట్‌ను తాత్కాలిక ప్రధాని కర్కి ఏర్పాటు చేస్తారని సన్నిహిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని కార్యాలయమైన సింగ్‌దర్బార్ సెక్రటేరియట్ ఆందోళనల్లో మంటలకు గురి కావడంతో సింగ్ దర్బార్ కాంప్లెక్సు లోనే హోం మంత్రిత్వశాఖ కోసం కొత్తగా నిర్మించిన భవనంలోనే ప్రధాని కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు.

పార్లమెంట్ రద్దుపై పార్టీల నేతలు, లాయర్ల విమర్శలు
పార్లమెంట్‌ను రద్దు చేసి తాజాగా ఎన్నికలకు తేదీని ప్రకటించడంపై నేపాల్ లోని ప్రధాన రాజకీయ పార్టీలు, బార్ కౌన్సిల్ న్యాయవాదులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని, ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని విమర్శించారు. అధ్యక్ష కార్యాలయం జారీ చేసిన నోటీస్ ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి పార్లమెంట్ రద్దు అమలు లోకి వచ్చింది. నేపాల్‌లో పెద్ద పార్టీ అయిన నేపాలి కాంగ్రెస్ (ఎన్‌సి) రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఎలాంటి చర్యనైనా అంగీకరించేది లేదన్నారు. సిపిఎన్ యుఎంఎల్ ప్రధాన కార్యదర్శి శంకర్ పొఖ్రేయిల్ ఇది రాజ్యాంగాన్ని హాస్యాస్పదం చేయడమేనని వ్యాఖ్యానించారు. మనం అప్రమత్తంగా ఉండాలని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్కిస్టు లెనినిస్టు), పార్లమెంట్‌ను రద్దు చేయడం తీవ్రమైన అనంగీకారమని సిపిఎన్ (మావోయిస్టు) విమర్శించాయి. రాజ్యాంగ సార్వభౌమత్వాన్ని అణగదొక్కి పార్లమెంట్‌ను ఏకపక్ష నిర్ణయంతో రద్దు చేయడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ధ్వజమెత్తింది.

ఖాట్మండ్ వ్యాలీలో కర్ఫూ ఎత్తివేత
ఖాట్మండ్ వ్యాలీలో శనివారం కర్ఫూ ఎత్తివేశారు. దీంతో సాధారణ జీవన విధానం యథావిధిగా మళ్లీ ప్రారంభమైంది. షాపులు, గ్రాసరీ స్టోర్లు, కూరగాయల మార్కెట్లు, షాపింగ్ మాల్స్, తిరిగి తెరుచుకున్నాయి. వీధుల్లోంచి ట్రాఫిక్ సాగడం నెమ్మదిగా ప్రారంభమైంది. ఆందోళన కారులు నిప్పుపెట్టిన, ధ్వంసం చేసిన భవనాలున్న ప్రాంతాలను పరిశుభ్రం చేస్తున్నారు.
గాయపడిన బాధితులకు ప్రధాని కర్కి పరామర్శ
ఆందోళనల్లో తీవ్రంగా గాయపడి ఖాట్మండ్ లోని బానేశ్వర్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని సుశీలా కర్కి శనివారం పరామర్శించారు.

Also Read: పాక్‌లో రెండు ఎన్‌కౌంటర్లు.. 12మంది సైనికులు, 35మంది ఉగ్రవాదులు మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News