Tuesday, May 20, 2025

గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాం :ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

- Advertisement -
- Advertisement -

గాజా మొత్తాన్ని తమ అధీనం లోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతల వేళ గాజాలో మరోసారి దాడుల తీవ్రతను పెంచిన నేపథ్యంలో ప్రధాని నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. దౌత్య కారణాలకు లోబడి గాజాలో క్షామాన్ని నివారించాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని చెప్పారు. “ మా పోరాటం తీవ్ర స్థాయిలో ఉంది. మేం పురోగతి సాధిస్తున్నాం. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణ లోకి తీసుకుంటాం. ఇందులో వెనక్కి తగ్గేదేలేదు. విజయం సాధించాలంటే మనల్ని అడ్డుకోలేరనే విధంగా వ్యవహరించాలి” అని టెలిగ్రామ్ వేదికగా నెతన్యాహు ఒక వీడియోను పోస్టు చేశారు. మరోసారి ఇజ్రాయెల్ గాజాపై దాడుల తీవ్రతను పెంచింది. శనివారం అర్థరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానికి దాడులు జరిపింది. ఖాన్‌యూనిస్‌లో 29 మంది, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియా లోని శరణార్థి శిబిరంలో 26 మంది,

మొత్తం 103 మంది మరణించారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణం గానే దాడులను తీవ్రం చేసినట్టు ఇటీవల నెతన్యాహు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా గాజా లోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ , సమీప ప్రాంతాలను ఖాళీ చేయాలని, స్థానిక ప్రజలకు ఇజ్రాయెల్ మిలిటరీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ప్రమాదకరమైన పోరాట ప్రాంతాలుగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు దోహాలో జరుగుతున్న చర్చల్లో హమాస్ బహిష్కరణ అంశాన్ని ఇజ్రాయెల్ తెరపైకి తీసుకొచ్చిందని తెలుస్తోంది. యుద్ధం శాశ్వతంగా ఆగాలంటే గాజా పాలన నుంచి హమాస్ వైదొలగాలని, ఆయుధాలు అప్పగించాలని, ఆ సంస్థ ఉగ్రవాదులంతా ఇతర దేశాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. అయితే గాజా నుంచి వెళ్లిపోవడానికి ఆయుధాలు అప్పగింతకు తాము సిద్ధంగా లేమని హమాస్ చెప్పినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News