ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో భాగంగా గురువారం జింబాబ్వేతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఇక ఆతిథ్య జింబాబ్వే టీమ్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్ టిమ్ సిఫర్ట్ ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలను దీటుగా ఎదుర్కొన్న సిఫర్ట్ 45 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 75 పరుగులు చేశాడు.
రచిన్ రవీంద్ర 7 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 63 పరుగులు సాధించాడు. మిఛెల్ బ్రేస్‌వెల్ 26(నాటౌట్) తనవంతు సహకారం అందించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 18.5 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. టోనీ మునియోంగా (40), డియాన్ మైయర్స్ (22), ముసెకివా (21) తప్ప మిగతా వారు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లలో ఐష్ సోధి 12 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇక శనివారం జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది.