ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఉగ్రవాద సంస్థ ISIS స్లీపర్ సెల్‌కు చెందిన ఇద్దరు నిందితులను శనివారం ముంబై విమానాశ్రయంలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. పూణేలో IEDల తయారీ, పరీక్షలకు సంబంధించిన 2023 కేసులో వీరిద్దరూ వాంటెడ్‌గా ఉన్నారని చెప్పారు. అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్‌గా గుర్తించిన నిందితులను నిన్న రాత్రి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద అదుపులోకి తీసుకున్నారు.
ఇన్నాళ్లు ఇండోనేషియాలో దాక్కుని..నిన్న జకార్తా నుండి భారత్ కు తిరిగి రావడానికి ప్రయత్నించగా ఇమ్మిగ్రేషన్ బ్యూరో వారిని అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. NIA బృందం వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిందని దర్యాప్తు సంస్థ ప్రకటన విడుదల చేసింది. రెండు సంవత్సరాలకు పైగా పరారీలో ఉన్న నిందితులపై NIA ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్‌లను జారీ చేసింది.