Saturday, July 19, 2025

నిమిష మరణశిక్ష తాత్కాలికంగా నిలిపివేత: సుప్రీంకు కేంద్రం వెల్లడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటోన్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో ఆమె భద్రంగా స్వదేశానికి వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని సుప్రీం కోర్టుకు కేంద్రం శుక్రవారం తెలియజేసింది. ఈ కేసుపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆమెకు మరణశిక్ష అమలును యెమెన్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయాన్ని కేంద్రం జస్టిస్‌లు విక్రమ్‌నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసులో తమవైపు నుంచి చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కోర్టుకు తెలియజేశారు. నిమిష ప్రియ తరఫున న్యాయవాదుల బృందం కోర్టుకు ఓ అభ్యర్థన చేసింది. ఈ కేసులో బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా యెమెన్ వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరింది.

దీనిపై స్పందించిన ధర్మాసనం, ప్రస్తుతం ఆ దేశానికి వెళ్లకుండా ప్రయాణ ఆంక్షలు ఉన్నందున దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వం వద్ద తమ అభ్యర్థన చేసుకునేలా పిటిషనర్లకు అనుమతి కల్పించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది. యెమెన్ దేశస్థుడి హత్య కేసులో నిమిష ప్రియకు జులై 16న మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా, చివరి నిమిషంలో అక్కడి ప్రభుత్వం దీన్ని వాయిదా వేసింది. బ్లడ్ మనీపై బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు మరింత సమయం ఇవ్వాలని భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఆ దేశం సానుకూలంగా స్పందించింది. అయితే ఈ బ్లడ్ మనీకి తాము ఎన్నటికీ అంగీకరించబోమని బాధిత కుటుంబం చెబుతోంది. దీంతో ఈ కేసు ఎలా ముగుస్తోందన్న ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News