Sunday, July 6, 2025

పిఎన్‌బి కుంభకోణం..అమెరికాలో నీరవ్‌మోడీ సోదరుడి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

భారతీయ బ్యాంకులను రూ. వేల కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ సోదరుడు నేహల్ దీపక్ మోడీ అరెస్ట్ అయ్యారు. భారత ప్రభుత్వం చేసిన అప్పగింత అభ్యర్థన నేపథ్యంలో అమెరికాలో ఈ అరెస్టు చోటు చేసుకుంది. రుణాల విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో నేహల్ మోడీ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దాంతో గత వారం అమెరికా పోలీసులు నేహల్‌ను అదుపు లోకి తీసుకున్నారు. తనపై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులను రద్దు చేసేలా అతడు ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. దాంతో తాజాగా అతడిని అరెస్టు చేశారు. అతడికి బెల్జియం పౌరసత్వం ఉంది. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణాలు తీసుకొని రూ. 13,500 కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2018లో భారత్ నుంచి ఆయన పరారీ అయ్యాడు. అప్పటి నుంచి భారత దర్యాప్తు సంస్థలు ఆయన కోసం వేట ప్రారంభించాయి.

భారత్‌కు అప్పగింతకు సంబంధించి నీరవ్‌కు వ్యతిరేకంగా ఫలితం రావడంతో మార్చి 19,2019 న లండన్ అధికారులు అరెస్టు చేసి జైలులో ఉంచారు. దాదాపు ఆరేళ్లుగా అతడు జైల్లోనే ఉంటున్నాడు. నీరవ్‌ను స్వదేశానికి తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు నీరవ్ మోడీ పదిసార్లు కోర్టులో బెయిల్ దరఖాస్తు చేశాడు. అన్నిసార్లు ఆయన భంగపాటుకు గురయ్యాడు. ఇక నేహల్ అప్పగింతకు సంబంధించి జులై 17న విచారణ జరగనుంది. ఆ రోజున నేహల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది. ఇక ఈ బ్యాంకు మోసం కేసులో నీరవ్ మామ మెహుల్ ఛోక్సీ పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆర్థిక నేరగాడిని బెల్జియం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడిని భారత్‌కు తీసుకురావడంపై ఏజెన్సీలు దృష్టి పెట్టాయి. ఇదిలా ఉంటే భారత్ అభ్యర్థన నేపథ్యంలో కొన్ని నెలల క్రితం ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు తహవూర్ రాణాను అమెరికాకు అప్పగించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News