నిర్మల్: ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపింది. అనంతరం మూర్ఛతో చనిపోయాడని స్థానికులు, గ్రామస్థులను నమ్మించి హత్య క్రియలు చేసింది. విదేశాల నుంచి వచ్చిన కుమారుడు నిలదీసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. న్యూవెల్మల్ గ్రామంలో తిరునగరి హరిచరణ్(50). నాగాలక్ష్మి(48) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. కుమారుడికి పెళ్లి చేసి ఇంట్లోనే కొడుకు, కోడలితో కలిసి ఉంటున్నారు. కుమారుడు ఉపాధి నిమిత్తం దుబయ్‌కు వెళ్లాడు. కోడలు అత్తమామలతో కలిసి ఉంటుంది. హరిచరణ్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాగలక్ష్మి అదే గ్రామానికి చెందిన మహేశ్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో ప్రియుడితో కలిసి తిరుగుతోంది. ఈ నెల 22న ప్రియుడితో కలిసి నాగలక్ష్మి బయటకు వెళ్లింది. ఇద్దరు కలిసి ఇంట్లో వస్తుండగా హరిచరణ్ వారిపై బ్యాట్‌తో దాడి చేశాడు.
మహేశ్ అప్రమత్తమై హరిచరణ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే భార్య భర్తను కాళ్లను తువాలుతో కట్టేసింది. మహేశ్ చీరతో మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం భర్త మూర్ఛ వ్యాధితో బాత్రూమ్లో పడి చనిపోయాడని స్థానికులను నమ్మించింది. గల్ఫ్ నుంచి కుమారుడిని పిలిపించి అంత్యక్రియలు జరిపించింది. కుమారుడు ఇంటికి వచ్చిన తరువాత బ్యాట్, తువాలు, చీర చిందరవందరగా పడి ఉండడంతో అనుమానం వచ్చి తల్లిని నిలదీశాడు. తల్లి నీళ్లు నమలడంతో సరైన సమాధానాలు చెప్పకపోవడంతో అనుమానంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సిఐ ఘటనా స్థలానికి చేరుకొని తల్లి నాగలక్ష్మిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకుంది. వెంటనే ఆమెతో పాటు ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని పరీక్షించిన ఆర్ఎంపి వైద్యుడు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: శ్రీ వినాయక వ్రత కథ