Wednesday, September 3, 2025

జిఎస్టి 2.0తో ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం

- Advertisement -
- Advertisement -

చిన్న వ్యాపారాలపై భారం తగ్గుతుంది
అభివృద్ధి దిశగా నడిపించడమే లక్ష్యం
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
చెన్నై: దేశ ఆర్థిక వ్యవస్థను తదుపరి తరం జిఎస్‌టి సంస్కరణలు (జిఎస్‌టి 2.0) పూర్తిగా పారదర్శకంగా, పటిష్టంగా మార్చబోతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇది చిన్న వ్యాపారాలపై భారాన్ని తగ్గిస్తూ, వారిని మరింత అభివృద్ధి దిశగా నడిపించడమే లక్ష్యమని ఆమె అన్నారు. మంగళవారం తమిళనాడులో సిటీ యూనియన్ బ్యాంక్ 120వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన అతిథిగా పాల్గొనగా, ఆర్థికమంత్రి కీలక ప్రసంగం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో భారీ స్థాయి జిఎస్‌టి సంస్కరణలను ప్రకటించి, దీపావళి కానుక అందిస్తామని చెప్పారు. దానిని అనుసరించేలా రాబోయే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం ఈ మార్పులకు పునాది వేస్తుందని ఆమె పేర్కొన్నారు. వికసిత భారత్ 2047 దిశగా ప్రయాణిస్తున్న భారత్‌లో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, ఎంఎస్‌ఎంఇలకు తగిన సమయంలో నిధుల ఏర్పాటు, బ్యాంకింగ్ సదుపాయాలకు దూరంగా ఉన్నవారిని చేర్చుకోవడం వంటి బాధ్యతలు బ్యాంకులపై ఉన్నాయని ఆమె తెలిపారు. ఆర్థిక రంగానికి విశ్వాసం, సాంకేతికత, పారదర్శకత మార్గదర్శక సూత్రాలుగా ఉండాలని ఆమె అన్నారు.

జన్‌ధన్ ఖాతాల్లో ఎక్కువ మహిళలే
గత 11 ఏళ్లలో 56 కోట్ల జన ధన్ ఖాతాలు తెరవగా, రూ.2.68 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. వీటిలో ఎక్కువ ఖాతాదారులు మహిళలే ఉన్నారని ఆమె వెల్లడించారు. భారత వాణిజ్య బ్యాంకుల ఆస్తి నాణ్యతలో గణనీయమైన మెరుగుదల వచ్చిందని, స్థూల ఎన్‌పిఎలు 2.3 శాతం, నికర ఎన్‌పిఎలు 0.5 శాతంకు తగ్గాయని ఆమె తెలిపారు. 18 ఏళ్ల తర్వాత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పి భారత్ దీర్ఘకాల రేటింగ్‌ను మెరుగుపరిచిందని సీతారామన్ గుర్తుచేశారు. దీంతో బ్యాంకులు భవిష్యత్తులో కూడా తక్కువ రిస్క్‌తో రుణాలు ఇవ్వగలుగుతాయని, మౌలిక వసతులు, గృహాలు, చిన్న వ్యాపారాలు లాభపడతాయని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతం జిడిపి వృద్ధి నమోదు కావడం, ద్రవ్యోల్బణం జూలైలో 1.55 శాతాని చేరడం ఆర్థిక వ్యవస్థ శక్తిని చూపుతున్నాయన్నారు. ఇపిఎఫ్‌ఒలో జూన్‌లోనే 22 లక్షల కొత్త సభ్యులు చేరడం మరో రికార్డని ఆమె చెప్పారు. జన ధన్ ఖాతాలు మహమ్మారి సమయంలో ఆర్థిక భద్రత కల్పించాయని అధ్యయనాలు వెల్లడించాయని ఆమె వివరించారు. ఒక బ్యాంకు ఖాతా కేవలం పాస్‌బుక్ కాదు, అది అవకాశాలకు పాస్‌పోర్ట్ అని వ్యాఖ్యానించారు. గ్రామీణ స్థాయిలో వృద్ధిని ఆర్థిక రంగం మద్దతు ఇవ్వాలి అని సీతారామన్ హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News