- Advertisement -
సముద్రాన్ని ఆటలాడిస్తున్న
నాలుక చేపపిల్ల మౌనంగా
ఈదులాడుతోంది
గొంతు ఒరనుండి విచ్చుకున్న
మాటల కత్తులు లేవు
పెదాల నుండి ఘీంకారాలు
త్రోసి పుచ్చుతూ వాళ్లు
మాట్లాడుకుంటారు
భరతనాట్య భంగిమలతో చేతులు
కథాకళి తోడుగా ముఖ కవళికలు
శబ్ద కాలుష్యాన్ని నిరసిస్తూ
మౌనరాగ కీర్తనలో
భావాల గేయాలాపన
శరీర కదలికలు వారథులై
నిరాటంకమైన భావ పరంపర
పూచిన ఆలోచనా పువ్వులను
నిశ్శబ్దదారుల్లో ఏరుకుంటూ
వారి ప్రయాణం
తీరం దూరమైనా, చేరువ అయ్యేందుకు
సాంకేతికత దారముంది
అజ్ఞాత శక్తి ఏదో.. అశక్తులను చేసినా
విధిని ఎదిరించిన ధిక్కారపు చేతనల
తలపుల, తలపోతల తృప్తి వారిది
అవ్వారు శ్రీధర్ బాబు
- Advertisement -