Sunday, May 4, 2025

ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పరిశీలనకు కృత్రిమ మేధ

- Advertisement -
- Advertisement -

 ఎక్కడ అవినీతి జరిగినా సహించం
పనులు పూర్తి కాకుండా నేను
చెప్పినా బిల్లులు చెల్లించవద్దు
ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై
టోల్‌ఫ్రీ నెంబర్ : మంత్రి
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కడ అవినీతి జరిగినా సహించేది లేదని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు సక్సె కావాలంటే యువ ఇంజనీర్ల పాత్ర కీలకమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం హౌసింగ్ కార్పొరేషన్‌లో ఔట్ సోర్సింగ్ కింద నియామకమైన 350 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ( న్యాక్) లో ఆరు రోజుల పాటు శిక్షణ పొందారు. శిక్షణ పూర్తి చేసుకున్న 350 మంది యువ అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎంపికైన 350 మంది ఇంజనీర్లలో 45 శాతం మహిళలే ఉండడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మెరిట్ పద్ధతిలోనే వారిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. గృహనిర్మాణ శాఖకు మంచిపేరు తీసుకురావాలని ఇంజనీర్లకు మంత్రి సూచించారు.లబ్ధిదారుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర పార్టీల వారు ఉన్నా అర్హులకే ఇళ్లు కేటాయించాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు పేదవారికి అందాలంటే అది పేద కుటుంబాల నుంచి వచ్చిన యువ ఇంజనీర్లకే సాధ్యమన్నారు.

ఎవరూ ప్రలోభాలు పెట్టినా డబ్బుకు ఆశపడొద్దు

ఎవరూ ప్రలోభాలు పెట్టినా డబ్బుకు ఆశపడొద్దని మంత్రి పొంగులేటి సూచించారు. 600 చదరపు మీటర్లలోపే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని, ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు కడితే తర్వాత రావాల్సిన బిల్లులు ఇవ్వబోమన్నారు. మొత్తం నాలుగు దశల్లో లబ్ధిదారులకు అందాల్సిన నిధులు విడుదల అవుతాయని పొంగులేటి తెలిపారు. గ్రౌండ్ లెవల్‌లో ప్రతి ఇంటిని పరిశీలించే బాధ్యత యువ ఇంజనీర్లదేనని ఆయన తెలిపారు. ప్రతి సోమవారం అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల నిధులు విడుదల చేస్తామని ఆయన తెలిపారు డబ్బులు విడుదల అయ్యాక ప్రతి ఇంటిని పరిశీలిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

పేదోడి ఇంటికి రూ. 5 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

పేదోడి ఇంటికి రూ. 5 లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఈ ఏడాది రూ.22 వేల కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో పేదలకు ఇంత పెద్ద ఎత్తున రూ. 5 లక్షలతో సంవత్సరానికి నాలుగున్నర లక్షల ఇళ్ల్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. మరికొద్ది రోజుల్లోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పైలెట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయన్నారు.

ఇంజనీర్లు ఫేజ్-1 నుంచి ఫేజ్ -4 వరకు జాగ్రత్తగా సిఫారసు

అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి ఇంటిని ట్రాక్ చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను (ఏఐ)ను పూర్తి స్థాయిలో వాడుతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి సోమవారం అర్హులైన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించబోతున్నామని ఆయన చెప్పారు. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చివరకు మంత్రిగా తాను ఫోన్ చేసినా ఫేజ్ ల వారీగా వర్క్ పూర్తి కాకుండా బిల్లుల కోసం సిఫార్సు చేయవద్దని ఆయన సూచించారు. ఇంజనీర్లు ఫేజ్-1 నుంచి ఫేజ్ -4 వరకు జాగ్రత్తగా సిఫారసు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలపై టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామని ఆ నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలన్నారు. తప్పు జరిగిందని చెబితే చాలు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.

ఈసారి ఆ 300 ఇళ్లకు మాత్రమే మినహాయింపు….

నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు 400ల నుంచి -600 చ.అడుగుల మధ్యే నిర్మించుకోవాలని అలాంటి వాటికే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టామని అయితే కొన్ని ప్రాంతాల్లో 600 చ.అడుగులు దాటి నిర్మించుకుంటున్నారని అలాంటి వాటికి బిల్లులు ఆపివేశామన్నారు. అయితే వాటిని పడగొట్టడం కంటే ప్రస్తుతానికి 600 చ.అడుగులు దాటి బేస్‌మెంట్ పూర్తయిన ఇళ్లకు ఈ సారికి మినహాయింపు ఇచ్చి రూ.లక్ష విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు మించిన విస్తీర్ణంలో బెస్‌మెంట్ వరకు పూర్తయిన ఇళ్లు దాదాపు 300 వరకు ఉన్నాయని వాటికి మినహాయింపు ఇస్తామని మంత్రి తెలిపారు. అయితే ఇది కేవలం బేస్ మెంట్ వరకు మాత్రమే మినహాయింపు ఉంటుందని, ఆపై జరిగే బ్రిక్స్ వర్క్ నిబంధనలకు అనుగుణంగా 400-ల నుంచి 600 చ.అడుగుల లోపు నిర్మిస్తేనే మిగతా బిల్లులు చెల్లిస్తామని మంత్రి చెప్పారు. ఈ మినహా యింపు కేవలం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అవుతున్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుంద న్నారు.

పదోన్నతులు పొందిన 21 మందికి సర్టిఫికెట్లు అందజేత

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 21 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. గ్రేడ్ -2గా పనిచేస్తున్న 10 మంది సబ్ రిజిస్ట్రార్‌లకు గ్రేడ్-1గా, సీనియర్ అసిస్టెంట్‌లుగా పనిచేస్తున్న 11 మందికి గ్రేడ్-2గా పదోన్నతులు కల్పించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి వారికి పదోన్నతి పొందిన సర్టిఫికెట్లను అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News