మన తెలంగాణ/దోమకొండ: మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో జాతీయ జెండా ఎగరవేయలేకపోవడం, కనీసం తలుపు కూడా తెరవకపోవడం విద్యావ్యవస్థను అవమానించినట్లే అని పలువురు నాయకులు, పౌరులు భావిస్తున్నారు. భారతదేశం గర్వించే విధంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ పండగ రోజు విద్యా వనరుల కేంద్రం కనీసం తలుపు కూడా తీయకపోవడం, పరిసరాలు శుభ్రపరచుకోకపోవడం శోచనీయమని అనుకుంటున్నారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యా వనరుల కేంద్రంలో జెండా ఎగురవేయకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేసే ఉపాధ్యాయుల కార్యాలయ ఆవరణ బురదతో అపరిశుభ్రంగా ఉండడం కొసమెరుపు.
విద్యావంతులైన ఉపాధ్యాయులు, యువతలో జాతీయత, అభ్యుదయ భావాలను పెంపొందింపజేసే వృత్తిలో ఉండి, పలువురికి విద్యను అభ్యసింపజేసే ఉపాధ్యాయులే జాతీయ జెండాను ఎగరవేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఏమిటి అర్థము అని పలువురు అనుకుంటున్నారు. జాతీయ జెండా వందనము విద్యార్థులలో జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ఉండాలే కానీ ఇలా నిర్వీర్యపరిచే విధంగా విద్యావనరుల కేంద్ర అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. జాతీయ జెండా ఎగరవేయని కార్యాలయం అధికారులపై ఉన్నతాధికారుల తీరు ఎలా ఉంటదో చూడాలి మరి.