Monday, June 16, 2025

ట్రంప్ పెత్తందారితనం కుదరదు

- Advertisement -
- Advertisement -

అమెరికాలో జోరుగా నో కింగ్స్ ఉద్యమం
పలు నగరాలలో నిరననకారుల ర్యాలీలు
ప్రెసిడెంట్ జన్మదినం..పలు చురకలు
వాషింగ్టన్‌లో సైనికదినోత్సవంలోనూ ఉద్రిక్తత

ఫిలడెల్ఫియా (అమెరికా) : అధికార జులుం చెల్లనేరదు. నో కింగ్స్ అంటూ అమెరికాలోని పలు ప్రాంతాలలో ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు జోరందుకుంటున్నాయి. పలు డౌన్‌టౌన్లు, చిన్న పట్టణాలలో కూడా జనం ట్రంప్ చర్యలను నిరసిస్తున్నట్లు పేర్కొంటూ ర్యాలీలు చేపట్టారు. ఇమిగ్రేంట్ హక్కులు కల్పించాలి. అణచివేత చర్యలు నిలిపివేయాలి. ప్రజాస్వామ్యం రక్షించాలనే నినాదాలతో నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. లాస్ ఏంజెలిస్‌లో ఇటీవల వలసదార్లపై ట్రంప్ అధికార యంత్రాంగం అణచివేతలు , ఈ క్రమంలో అక్కడికి ట్రంప్ నేరుగా తమ జాతీయ రక్షణ దళాలను పంపించడం, స్థానిక పోలీసు బలగాలతో నిమిత్తం లేకుండా వారు బందోబస్తుకు దిగడం వంటి పరిణామాలు క్రమేపీ వలసదార్ల నుంచి నిరసనలకు దారితీశాయి.

ఇక్కడ రాజులెవరూ లేరనే పోస్టర్లతో న్యూయార్క్, డెన్వెర్, చికాగో, ఆస్టిన్, లాస్ ఎంజెలిస్ , అట్లాంటా ఇతర ప్రాంతాలలో వేలాదిగా జనం తరలివచ్చి, ట్రంప్ వ్యతిరేక నినాదాలకు దిగడంతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. కొన్ని రాష్ట్రాలలో డెమోక్రాటిక్ గవర్నర్లు ఉండటంతో జాతీయ స్థాయి భద్రతా బలగాలకు స్థానికంగా సరైన సహకారం అందడం లేదు. పలు ప్రాంతాలలో వందలాదిగా రోడ్డు పక్క సమావేశాలు జరుగుతున్నాయి. దేశం ఎటువెళ్లుతోంది. ఇది ప్రజాస్వామ్యమా? నియంత్రత్వమా? అని ప్రశ్నిస్తూ జనం రోడ్లపైకి వస్తున్నారు. నో కింగ్స్ బ్యానర్‌పై ఇప్పుడు అమెరికాలో ట్రంప్ వ్యతిరేక ఉద్యమం మరింత ఉధృతం అయ్యే పరిస్థితి నెలకొంటోంది. పలు ప్రాంతాలలో జనం గుమికూడటంతో పార్క్‌లు, వీధులు, ప్లాజాలు కిక్కిరిసిపోతున్నాయి. ప్రశాంతంగానే నిరసనలు సాగుతున్నాయి.

పౌరుల స్వేచ్ఛ కీలకం అని , అమెరికా స్వేచ్ఛా స్వాతంత్య్ర అంతర్లీనతకు భంగం వాటిల్లితే , దీనికి అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని సాకుగా చేసుకుంటే సహించేది లేదని ప్రదర్శనకారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ పౌరులదే రాజ్యం , రాజులు ఎవరూ లేరని నినాదాలు మిన్నంటుతున్నాయి. పలుప్రాంతాల్లో నిరసనలు సాగుతూ ఉన్నా, ఇవి ఎక్కువగా క్రమశిక్షణాయుతంగానే ఉండటం, ఘర్షణలకు తావులేకపోవడంతో ఈ నో కింగ్స్ నిర్వాహకులు అత్యంత వ్యూహాత్మక రీతిలోనే తమ ఉద్యమాన్నిబలోపేతం చేసుకుని వెళ్లే వీలుందని పరిశీలకులు తెలిపారు. అయితే సాల్ట్ లేక్ ఇతర ప్రాంతాలలో స్వల్ప స్థాయిలో ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల అరెస్టులు జరుగుతున్నాయి. సాల్ట్ లేక్ సిటీలో ఓ వ్యక్తి కాల్పులకు దిగాడు. ఈ షూటర్ కు కూడా పోలీసుల కాల్పుల్లో గాయపడ్డాడని స్థానిక పోలీసు అధికారి బ్రెయిన్ రెడ్డ్ తెలిపారు.

అట్లాంటాలో 5 వేల మందికి పైగా రోడ్లపైకి వచ్చారు. ఇక ఈ ప్రదర్శనల దశలోనే అధ్యక్షులు ట్రంప్ దేశ సైన్యం 250వ వార్షికతోత్సవం నేపథ్యంలో వాషింగ్టన్‌లో జరిగే సైనిక కవాతు లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ రోజే ట్రంప్ జన్మదినం కూడా కావడంతో ఆయన అభిమానులు తరలివచ్చారు. ఇక్కడ కూడా భద్రతా వలయాలను బేఖాతరు చేస్తూ నిరసనకారలు గుమికూడారు. వాషింగ్టన్‌లోని లోగాన్ సర్కిల్‌లో నిరసనకారులు ట్రంప్ వెళ్లిపోవాలని నినాదాలకు దిగారు. దీనితో ఇక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఇక నిరసనకారుల గుంపు ట్రంప్ భారీ బొమ్మను పట్టుకుని ముందుకు కదిలారు. కిరీటం ధరించి ఉన్న ట్రంప్ బంగారపు టాయ్‌లెట్ పై కూర్చుని ఉన్న వ్యంగ్యచిత్రాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ఓ వైపు అమెరికా జండాలు పంచిపెడుతూ , జాతీయతను చాటుకుంటూ వారి నిరసనలు సాగాయి. వర్జీనియా, లాస్‌వేగాస్ , మేరీలాండ్ ఇతర ప్రాంతాల్లోనూ నిరసనకారులతో వీధులు మార్మోగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News