డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి అంతర్జాతీయ సంబంధాల్లో వివాదాస్పద ప్రవర్తనలో ఇమిడి ఉంది. ట్రంప్ దౌత్య అతిక్రమణలు, అవమానకరమైన భాష, భారత్‌పాకిస్తాన్ వివాదంలో అనవసర జోక్యం, ధనిక దేశంగా లేదా సైనికశక్తి బలంగా ఉన్న దేశానికి ప్రపంచ పోలీసుగా వ్యవహరించే హక్కు ఉంటుందా? అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది. ట్రంప్ బహిరంగ వ్యాఖ్యలు తరచుగా అసభ్యత, అవమానం దిశగా దిగిజారుతుంటాయి.
స్నేహితులు, శత్రువులు అనే విచక్షణ లేకుండా నిర్లక్ష్యంగా మాటలు మీరుతుంటారు. వాణిజ్య చర్చల్లో కెనడా, మెక్సికోలను అమెరికాను వాడుకునే దేశాలుగా పేర్కొన్నారు. సుంకాలతో బెదిరించి సన్నిహిత స్నేహ దేశాలతో సంబంధాలను దెబ్బతీశారు. యూరోపియన్ మిత్రదేశాలను అమెరికా సైనిక రక్షణపై ఆధారపడే ఉచిత సవారీదారులు అంటూ ఎగతాళి చేసి, నాటో దేశాలలో విశ్వాసాన్ని క్షీణింప జేశారు. ఆసియాలో ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్- ఉన్‌ను లిటిల్ రాకెట్ మాన్ అని హేళన చేసి, తర్వాత పొగడ్తలకు దిగడం దక్షిణ కొరియా, జపాన్‌ను గందరగోళానికి గురిచేసింది.ఇటువంటి పరుషమైన భాష వారి సహకారాన్ని పెంపొందించకపోగా మిత్రదేశాలను దూరం చేసింది. ట్రంప్ వ్యక్తి గత అహంకారం అమెరికా నైతిక ప్రతిష్టను గౌరవాన్ని తగ్గిస్తుంది. ఎక్స్‌లోని పోస్టులు ట్రంప్‌ను హిందీ సినిమాలో విలన్‌తో పోల్చాయి. ఆయన భాష ప్రపంచ నాయకుడి హోదాకి తగని విధంగా ఉందని అనేక దేశాల విజ్ఞులు విమర్శించారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ‘అమెరికా గొప్పతనం’ ట్రంప్ (పిచ్చోడి చేతిలో రాయిలా) తయారయింది. ఆయన నిలకడలేని మాటలు, ప్రవర్తన విదూషకుడిని తలపిస్తాయి. కశ్మీర్ విషయంలో ట్రంప్ అసంబద్ధ దౌత్యం స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న ఆయన కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం చేయగలనని, భారత ప్రధాని నరేంద్ర మోడీ తన సహాయం కోరారని పేర్కొన్నారు. భారత్ ప్రభుత్వం ఈ వాదనను ఖండించింది. ఇటీవల 2025 మేలో భారత్ ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్ ప్రతిస్పందనలతో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు, ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ లో రెండు దేశాలు తన జోక్యంతో కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. ఈ వాదన ఆయన పాత్రను అతిశయోక్తిగా ప్రజలు అనుకుంటున్నారు. ఆయన మాటలు ద్వైపాక్షిక చర్చల గతిశీలతను పట్టించుకోలేదు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అనే విషయం మరచి అసందర్భంగా మాట్లాడటం హద్దు మీరటమే. మూడోపక్ష మధ్యవర్తిత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు భారత్ స్థిరంగా ఏనాడో చెప్పింది. ఇప్పటికీ చెబుతోంది. ట్రంప్ కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తాను అనే అనవసర ప్రతిపాదన భారత్ సార్వభౌమాధికారాన్ని అగౌరవ పరిచినట్టే. ఆయన మాటలు పాకిస్తాన్‌కు ఊతం ఇచ్చినట్లు అవుతుంది. ‘ఎక్స్’లో నెటిజన్లు ట్రంప్ అతిగా జోక్యం చేసుకోవడాన్ని ఘాటుగా దుయ్యబట్టారు. కశ్మీర్ చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏదిపడితే అది మాట్లాడటం వదురుబోతు లక్షణంగా విమర్శించారు.
ట్రంప్ జోక్యం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించటమే. భారత సార్వభౌమాధికారాన్ని ధిక్కరించటమే అవుతుంది. అమెరికా ఆర్థికంగా బలమైన దేశం కావచ్చు. అలాగే సైనికశక్తి కూడా గొప్పగా ఉండవచ్చు. అంతమాత్రం చేత ఇతర దేశాల అంతర్గత లేదా ద్వైపాక్షిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు, అధికారం ఆయనకు లేదు. అమెరికాకు ధనం, ఆయుధాలు, అణుబాంబులు ఉన్నంత మాత్రాన ట్రంప్‌కు ప్రపంచపై పోలీసు అధికారాన్ని ఇవ్వవు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో సార్వభౌమాధికారం గల దేశాల స్వయం పరిపాలనను గౌరవించమని చెబుతుంది. అన్ని సార్వభౌమత్వం గల దేశాలు సమానమే. చిన్నదేశం అయినా, పెద్దదేశం అయినా సమానం హోదాను కలిగి ఉంటాయి. కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే భారత్, పాకిస్తాన్‌తో వాణిజ్యాన్ని నిలిపివేస్తానని ట్రంప్ బెదిరించటం చెల్లదు. అమెరికా బలవంతపు వ్యూహాలు, చర్యలు ఉద్రిక్తతలను పరిష్కరించకపోగా మరింత పెంచుతాయి.
దేశాల మధ్య గల స్నేహ, సహకార సంబంధాలను దూరం చేస్తాయి. అమెరికా పెద్దన్న నాయకత్వ హోదాపై విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ట్రంప్ సుంకాల విధానాలు దౌత్య నిబంధనలను లెక్కచేయని వైఖరిని చూపిస్తాయి. భారత్, చైనా, యూరోపియన్ యూనియన్‌లపై సుంకాలు విధించడం లేదా బెదిరించడం ద్వారా ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలను రేకెత్తించారు. ఇతర దేశాలు అమెరికా మార్కెట్‌ను దోపిడీ చేస్తున్నాయని ఆయన అర్ధం లేని ఆరోపణలు వర్తక, వాణిజ్యం పరస్పర ప్రయోజనాలను విస్మరిస్తుంది. మిత్ర దేశాలను శత్రువులుగా చిత్రీకరిస్తుంది. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని భంగం చేస్తుంది, అమెరికా నమ్మకమైన భాగస్వామిగా ఉన్న ఖ్యాతిని దెబ్బతీస్తుంది. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం అమెరికా యువతకు ఆకర్షణీయ నినాదంగా ఉన్నప్పటికీ, ఇతర దేశాలను అమెరికాకు దూరం చేస్తుంది. పర్యావరణం సమతుల్యత, భద్రత వంటి అంశాల్లో నిధులు రద్దు చేసి, సభ్యత్వం, సహకారాన్ని అందించని ఆయన నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఇబ్బందిపెడుతున్నాయి.
అమెరికాను మళ్లీ గొప్పగా చేస్తానని ట్రంప్ చెప్పడం మంచిదే. గొప్ప ఆదర్శమే అందరూ ఆ లక్ష్యాన్ని గౌరవిస్తారు. అయితే అందుకు అనుసరించే పద్ధతులు కూడా ఆదర్శంగా ఉండాలి. అంతేగానీ విడ్డూరంగా ఉండకూడదు. ఆయన చర్యలు మిత్ర దేశాలను దూరం చేసుకొనే విధంగా ఉన్నాయి. ఆయన ప్రవర్తనతో అమెరికా కు శత్రువులను పెంచుతుంది. మిత్రదేశాలు మధ్య విభజన జరుగుతుంది. ట్రంప్ దౌత్యవైఫల్యాలు ఆయన ఆక్షేపణీయ మాటల నుండి వస్తున్నాయి. భారత్- పాకిస్తాన్ ద్వైపాక్షిక వివాదాల్లో అనవసర జోక్యం తగదు. ప్రపంచ నాయకత్వంపట్ల లోతైన అవగాహనను ఆయన పెంచుకోవాలి. కశ్మీర్ విషయంలో పూర్వచరిత్ర తెలియని ఆయన మాటలు అర్ధం లేనివి.
అమెరికా ఆర్థికశక్తి, ఆయుధ శక్తితోనే పెద్దరికం రాదు. ఆయన మాటలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా లేవు. ఆయన బలప్రదర్శన, ఒత్తిళ్లు సమర్థనీయం కావు. ఆయన మాటలు దేశాల సార్వభౌమాధికారాన్ని అగౌరవపరిచాయి. సున్నితమైన భౌగోళిక సమస్యలను సంక్లిష్టం చేశాయి. ప్రపంచాన్ని శాసించే అధికారం కేవలం ధనం లేదా ఆయుధాలతో రాదు, పరస్పర గౌరవం, సహకారం, మర్యాద ద్వారా లభిస్తుంది. ట్రంప్ నిరంతరం ఈ లక్ష్యాలను, విలువలను దెబ్బ తీశారు. అమెరికా తన గౌరవాన్ని పునరుద్ధరించాలి అంటే, విభజన, ఆధిపత్య వైఖరిని వదిలి, పరస్పర గౌరవం, సమన్వయంతో కూడిన దౌత్యాన్ని అనుసరించాలి.
డా. కోలాహలం రామ్ కిశోర్
9849328496