టి-20, టెస్ట్ ఫార్మాట్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనాలని వీరిద్దరు భావిస్తున్నారు. అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. అయితే మరోవైపు రోహిత్, కోహ్లీలు త్వరలోనే వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పాస్తారనే మాట కూడా వినిపిస్తోంది. అయితే తాజాగా ఐసిసి రో-కోలకు షాక్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో (ICC ODI Rankings) వీరిద్దరి పేరు కనిపించలేదు. ఆగస్టు 13న ప్రకటించిన ఐసిసి ర్యాంకుల్లో రోహిత్ 2వ స్థానంలో, కోహ్లీ 4వ స్థానంలో ఉండగా.. ఈ వారం ప్రకటించన లిస్ట్‌లో వీరిద్దరి పేరు మాయం అయింది.
మొదటి స్థానంలో శుభ్‌మాన్ గిల్ అలాగే కొనసాగుతుండగా.. రెండో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ నిలిచాడు. అయితే దీని వెనుకగల కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. సాధారణంగా ఓ ఫార్మాట్‌లో 9-12 నెలల కాలం పాటు ఒక మ్యాచ్ కూడా ఆడకపోతే.. ఆ ఆటగాడి పేరును ర్యాంకింగ్స్ (ICC ODI Rankings) నుంచి తొలగిస్తారు. కానీ, రోహిత్, కోహ్లీలు ఐదు నెలల క్రితం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నారు. దీంతో ఈ కారణం చేత వీరి పేరును తొలగించే అవకాశం లేదు. అయితే దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, కోహ్లీలను వన్డేల నుంచి కూడా దూరం చేయాలని బిసిసిఐ.. ఐసిసికి ఏదైనా లేఖ రాసిందా అని అనుకుంటున్నారు. కానీ, ఏదో సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక టాప్-10లో భారత్ తరఫున శుభ్‌మాన్ గిల్ కాకుండా కేవలం శ్రేయస్ అయ్యర్‌కి మాత్రమే చోటు దక్కింది.