Wednesday, July 16, 2025

బనకచర్లపై చర్చల్లేవ్.. కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల సిఎంల సమావేశం ఎజెండా నుంచి బనకచర్లను తొలగించాలి
ప్రాజెక్టుపై ఇప్పటికే ఎన్నో అభ్యంతరాలు తెలిపిన తెలంగాణ
చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘిస్తున్న బనకచర్ల
కేంద్ర జలశక్తి కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఘాటు లేఖ
ఎజెండాలో తెలంగాణ ప్రతిపాదనలు చేర్చాలని డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా, గోదావరి నదీ జలాల జలవివాదాలపై కేంద్ర జలశక్తి బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన సమావేశంలో గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఎజెండా అంశాల్లో చేర్చడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం నాడు సుధీర్ఘంగా ఆరు పేజీలతో కూడిన లేఖను కేంద్ర జలశక్తి కార్యదర్శికి రాశారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కేంద్రానికి లేఖలు అందజేసిన విషయాన్ని మరోసారి గుర్తుచేస్తూ న్యూఢిల్లీలో బుధవారం జరిగే ఇరు రాష్ట్రాల సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని సిఎస్ స్పష్టం చేశారు.

సమావేశం ఎజెండాలో బనకచర్ల ప్రాజెక్టు ప్రస్తావనను సవరించాలని కోరారు. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఉన్న అభ్యంతరాలన్నింటినీ ప్రభుత్వం ఈ లేఖలో వివరంగా ప్రస్తావించారు. బుధవారం నాటి సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండాను కేంద్రానికి పంపించింది. దానిని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు గుర్తించి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సిఎం ఆదేశాల మేరకు సిఎస్ రామకృష్ణారావు కేంద్రానికి ఈ లేఖ రాశారు. ఇప్పటికే కృష్ణా నదిపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీల ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టిఎంసిల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టిఎంసిల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఎజెండా ప్రతిపాదనలను కేంద్రానికి పంపించింది.

బనకచర్ల ఉల్లంఘనల ప్రాజెక్టు
జీఆర్‌ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ నుంచి బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయని, ఇప్పటివరకు బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నింటిని ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వాదనను ఆ లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గోదావరి -బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ స్పష్టంచేసింది. ఎపి ప్రభుత్వం చేస్తున్న చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలో పేర్కొన్నారు.
పర్యావరణ కమిటి తిరస్కరించింది
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ ను కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ తిరస్కరించిన విషయాన్ని సిఎస్ లేఖలో గుర్తుచేశారు. కేంద్ర జల సంఘం కూడా ప్రీ ఫిజిబులిటీ రిపోర్టును తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలని, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను అజెండాలో చేర్చాలని సిఎస్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News