ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో
ఆర్థిక శాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ భేటీ
తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వామ్యం పంచుకోవాలని
అభిజిత్ బెనర్జీని కోరిన సిఎం రేవంత్‌రెడ్డి
బోర్డులో చేరడానికి సమ్మతించిన అభిజిత్
భారత్ ఫ్యూచర్ సిటీలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సృజనాత్మకతను భాగం చేయాలి: అభిజిత్ బెనర్జీ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్థిక శాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ (Nobel laureate Abhijit Banerjee) ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన పథకాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై వారిద్దరూ చర్చించారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సిఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలు, ఆర్థిక క్రమశిక్షణ, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సృష్టించడంతో పాటు తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ విజన్, ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనకు వివరించారు. తెలంగాణకు సంబంధించిన విశిష్టతను, ఇక్కడున్న అనుకూలతలను ప్రపంచమంతటా చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతుల సాధికారత, యువతకు ఉద్యోగాలతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ దిశగా ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక చర్యల గురించి సిఎం రేవంత్ ప్రస్తావించారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వామ్యం పంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అభిజిత్ బెనర్జీని ఆహ్వానించారు. భవిష్యత్ విజన్ రూపకల్పనలో ఇతర ప్రముఖులతో పాటు తమ అనుభవాలను పంచుకోవాలని సిఎం కోరారు. గొప్ప విజన్ తో ముందుకు సాగుతున్నారని అభిజిత్ బెనర్జీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు బోర్డులో చేరడానికి ఆయన సమ్మతించారు. పోలీస్, మున్సిపల్ శాఖల్లో ట్రాన్స్‌జెండర్ల నియామకం, ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెక్టార్‌గా అభివృద్ధి చేసే ప్రణాళికను ఎంచుకోవటం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అద్దం పట్టిందని అభిజిత్ బెనర్జీ (Nobel laureate Abhijit Banerjee) ముఖ్యమంత్రిని అభినందించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సృజనాత్మకతను భాగం చేయాలని అభిజిత్ బెనర్జీ సూచించారు. సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా, మార్కెటింగ్ నైపుణ్యాలతో వారిని వృద్ధి చేయాలన్నారు.