లోక్‌సభలో తనను అధికార పక్షం మాట్లాడనివ్డడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా సభలో మాట్లాడే హక్కు తనకు ఉందని, అయితే తనకు అడ్డుతగులుతూ అధికార పక్షం తమ ప్రకటనలు సాగిస్తున్నారని తెలిపారు.పార్లమెంట్ తొలిరోజు వాయిదా తరువాత ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. సభలో ఇకపై కూడా ఏం జరుగుతుందనేది తెలిసిపోయింది. రక్షణ మంత్రి, బిజెపి ఎంపిలను పదేపదే మాట్లాడనిచ్చారు. కనీసం తన ప్రతిపక్ష నేత హోదాకు అయినా గౌరవం ఇచ్చి స్పందించే అవకాశం ఇవ్వాలి కదా? ఇదెక్కడి న్యాయం అని మీడియాతో రాహుల్ తమ బాధ పంచుకున్నారు.
తన హక్కును కాదనడం సబబా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీకి సభ అంటే భయం అని, వచ్చినట్లు వచ్చి సెకండులో మాయం అవుతారని వ్యాఖ్యానించారు. అధికార పక్షం అనుమతిస్తేనే కదా చర్చ జరిగేది. దీనికి వారు వీలు కల్పించరు కదా, ఇప్పుడు సభలో ఎవరు బాధితులు అనేది అందరికీ తెలిసిందే లేకపోతే తెలియచేస్తానని, అధికార పక్షం వారు చెప్పేది ప్రతిపక్షం వింటూ పోతూ ఉండాలి. ఇక తాము ఏదైనా రెండు మూడు మాటలకు దిగితే అధికార పక్షం అందుకు ససేమిరా అంటుందని నిరసన వ్యక్తం చేశారు. సభలలో తాను ఎప్పుడూ బాధితుడినే అని స్పందించారు.