మతమార్పిడులు అరికట్టేందుకు టీటీడీ సరికొత్త వ్యూహం
దళితవాడల్లో విస్తృతంగా చేతి పుస్తకాల పంపిణీ
వైకుంఠం కంపార్ట్మెంట్లలోనూ నిరంతరం భక్తులకు పుస్తకాల వితరణ
-టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి
మన తెలంగాణ/జూలై 7/తిరుమల ప్రతినిధి: దేశవ్యాప్తంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చిన్న సైజులో చేతి పుస్తకాల రూపంలో ముద్రించి ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా ధార్మిక ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. విపరీతంగా పెరిగిపోతున్న మతమార్పిడులను అరికట్టేందుకు సరికొత్త వ్యూహంతో హిందూ ధర్మ ప్రచారాన్ని సామాన్య ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు సంకల్పించింది. శ్రీ వెంకటేశ్వర వైభవం, విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, లలితా సహస్రనామం, శివ స్తోత్రం, భగవద్గీత, మహనీయుల చరిత్ర, తదితర హిందూ దేవుళ్లకు సంబంధించిన పురాణాలు తదితర అంశాలతో సంబంధించిన ధార్మిక పుస్తకాలను ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా రాష్ట్రంలో దళితవాడల్లో ఉచితంగా అందరికీ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు.
టీటీడీకి చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగం ద్వారా ఈ ధార్మిక చేతి పుస్తకాలను చిన్న సైజులో భక్తులకు సౌకర్యవంతంగా ముద్రించి దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం కాకుండా తిరుమల తిరుపతిలలో కూడా భక్తులకు శ్రీవారి పుస్తక ప్రసాదంగా అందజేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో శ్రీవారికి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో వేచి ఉండే భక్తులకు ఇలాంటి ధార్మిక చేతి పుస్తకాలను అందజేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వాటిని పూర్తిగా అధ్యయనం చేసి భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇందుకు టీటీడీ నిధులను ఏమాత్రం వినియోగించే అవసరం లేకుండా కోట్లాది పుస్తకాలను ముద్రించేందుకు అందుకే ఖర్చును భరించేందుకు అనేకమంది దాతలు ముందుకు వచ్చారని వారి సహకారంతో ఈ హ్యాండ్ బుక్స్ ముద్రించి ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అన్ని ప్రాంతాలకు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు టిటిడి చైర్మన్ బిఆర్. నాయుడు వివరించారు.