ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ ప్రస్థానం ముగింపు దశకు చేరుకుంది. జకోవిచ్ సమకాలీకులు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రఫెల్ నాదల్ (స్పెయిన్)లు ఇప్పటికే అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు పురుషుల టెన్నిస్‌ను ఈ త్రయమే ఏలింది. గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరూ గెలవడం అనవాయితీగా ఉండేది. మధ్యలో ఆండ్రీ ముర్రే వంటి వారు వచ్చిన ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. జకోవిచ్, నాదల్, ఫెదరర్‌లు కలిసి ఏకంగా 66 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకోవడం విశేషం. వీటిలో జకోవిచ్ అత్యధికంగా 24 టైటిల్స్‌ను దక్కించుకున్నాడు. నాదల్ 22 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలతో రెండో స్థానంలో నిలిచాడు. ఫెదరర్ 20 టైటిల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం జకోవిచ్ ఆటలో కొనసాగుతున్నా అతను రెండేళ్లుగా ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా సాధించలేక పోయాడు.
యువ ఆటగాళ్లు జన్నిక్ సినర్ (ఇటలీ), కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్)లు మాత్రమే గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంటున్నారు. వీరిని దాటి మరే ఆటగాడు కూడా గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలను గెలవలేక పోతున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచ టెన్నిస్‌లో జకోవిచ్ శకం ముగిసిందనే చెప్పాలి. ఒకవైపు వయో భారం, మరోవైపు ఫిట్‌నెస్ సమస్యలు జకోవిచ్‌ను వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నొవాక్ మరో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని గెలుచుకోవడం చాలా కష్టంతో కూడుకున్న అంశంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సినర్, అల్కరాజ్‌ల హవా నడుస్తోంది. సినర్ చాలా కాలంగా పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ టైటిల్‌ను సాధించి టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకున్నాడు. అల్కరాజ్ ఈ ఏడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను మాత్రమే గెలవగా, సినర్ ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు వింబుల్డన్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.
కిందటి ఏడాది యూఎస్ ఓపెన్‌ను కూడా సినర్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో జరిగే యూఎస్ ఓపెన్‌ను కూడా గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. సినర్ ఆటను గమనిస్తే జకోవిచ్ వారసుడిగా అతనే సరైనోడిగా కనిపిస్తున్నాడు. రానున్న రోజుల్లో సినర్ పురుషుల టెన్నిస్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగడం ఖాయమనే చెప్పాలి. ఒకప్పుడూ పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్, జకోవిచ్‌లు తమ హవాను నడిపించారు. నాదల్ జోరు ఫ్రెంచ్ ఓపెన్‌కు మాత్రమే పరిమితమైంది. కానీ సినర్ ఆట ఆ దిగ్గజాలను తలపిస్తోంది. అల్కరాజ్ కూడా నాదల్‌లాగే మట్టికోర్టులపైనే ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. అయితే అపార ప్రతిభావంతుడైన సినర్ మాత్రం నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలోనూ నిలకడగా రాణించడం ఖాయమని చెప్పాలి.