మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ టెన్నిస్‌లో ఎదురులేని శక్తిగా పేరు తెచ్చుకున్న సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ కొంత కాలంగా గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కోసం పరితపిస్తున్నాడు. 2023లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచి పురుషుల టెన్నిస్‌లో పెను ప్రకంపనలు సృష్టించిన జకోవిచ్ ఆ తర్వాత జోరు తగ్గాడు. 2024లో నొవాక్ ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకోలేక పోయాడు. ఈ ఏడాది జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో కూడా నొవాక్‌కు నిరాశే మిగిలింది. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో ఫైనల్‌కు కూడా చేరుకోలేక పోయాడు.
ఇటలీ సంచలనం జన్నిక్ సినర్, స్పెయిన్ యువ హీరో కార్లొస్ అల్కరాజ్‌లు ప్రస్తుతం ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో జోరు కొనసాగిస్తున్నారు. కిందటి ఏడాది సినర్, అల్కరాజ్‌లు చెరో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో సినర్, అల్కరాజ్‌లు ఒక్కో ట్రోఫీని సొంతం చేసుకున్నారు. చివరి ఆరు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలలో సినర్, అల్కరాజ్‌లే మూడేసి సార్లు విజేతగా నిలువడం విశేషం. ఇలాంటి స్థితిలో సెర్బియా యోధుడు నొవాక్ కెరీర్‌లో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధిస్తాడా లేదా అనేది సందేహంగా మారింది. ప్రస్తుతం జకోవిచ్ ఉన్న స్థితిలో యువ ఆటగాళ్లు సినర్, అల్కరాజ్‌లను తట్టుకుని గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడం నొవాక్‌కు శక్తికి మించిన పనిగానే చెప్పొచ్చు. ఒకవైపు పెరుగుతున్న వయసు ఒక కారణం కాగా, రెండో వైపు ఫిట్‌నెస్, గాయాల సమస్య జకోవిచ్‌ను వెంటాడుతోంది.
ఈ పరిస్థితుల్లో తనకు ఎంతో కలిసి వచ్చే వింబుల్డన్ ఓపెన్‌లో జకోవిచ్ ఎంతవరకు రాణిస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది. అల్కరాజ్, సినర్, జ్వరేవ్ వంటి యువ ఆటగాళ్ల నుంచి అతనికి గట్టి పోటీ నెలకొంది. యువ ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌తో ముందుకు సాగుతుండగా జకోవిచ్ పూర్వవైభవం సాధించడానికి సర్వం ఒడ్డుతున్నాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే సినర్, అల్కరాజ్‌లను తట్టుకుని ముందుకు సాగడం జకోవిచ్‌కు దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. అయితే పట్టుదల, అంకితభావానికి మరో పేరుగా చెప్పుకునే నొవాక్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఎలాంటి స్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా అతనికి ఉంది. ఇప్పటికే 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో జకోవిచ్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.