Sunday, August 10, 2025

ఎన్‌టిపిసి పెట్టుబడి రూ.80,000 కోట్లు

- Advertisement -
- Advertisement -

సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు
 ఇక నీటితో పాటు కరెంటు ప్రవాహం
 జలాశయాలు, కాల్వలపై సంప్రదాయేతర విద్యుత్ కేంద్రాలు
 ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో 6,700 మెగావాట్ల సామర్థ్యానికి అవకాశం
 సిఎం రేవంత్‌రెడ్డితో ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ ప్రతినిధి బృందం భేటీ

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర రుణ పరిమితిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన కొత్త రుణాల సమీకరణ అసాధ్యంగా మారిన తరుణంలో సొంత ఆదాయ వనరులపై నీటి పారుదల శాఖ దృష్టి సారించింది. ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో రాష్ట్రంలోని జలాశయాలు, సాగునీటి కాల్వలపై భారీ ఎత్తున సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపధ్యంలో తెలంగాణలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు ఎన్టీపీసీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి తెలిపింది. ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రితో శనివారం మర్యాదపూర్వకంగా భేటీ అయింది.

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు ఎన్టీపీసీ సుముఖంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆ ప్రతినిధి బృందం తెలిపింది. ప్రధానంగా సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు 80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ వివరించారు. ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో 6,700 మెగావాట్ల సామర్థ్యానికి అవకాశం ఉందని వివరించగా, రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇటువంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తాయని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు, కొత్త ఉద్యోగాల కల్పనకు కూడా ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. ముఖ్యంగా ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు భూమిని వినియోగించుకోకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది భూమి కొరత ఉన్న ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రంలోని పెద్ద రిజర్వాయర్లు, జలాశయాలు అనుకూలంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తన విద్యుత్ అవసరాల కోసం థర్మల్, జల విద్యుత్ పై ఆధారపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న జనాభా, వ్యవసాయ భూముల విస్తీర్ణం, పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధి కారణంగా విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఎక్కువగా ఆధారపడుతోంది.

16 జలాశయాలపై 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లు : రాష్ట్రంలోని 16 జలాశయాలపై 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లు, కాల్వలపై మరో 2000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు, నదులపై మరో 5 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రాలు కలిపి 13,800 మెగావాట్ల సంప్రదాయేతర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి అవకాశముందని తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నివేదిక సమర్పించింది. ఈ కేంద్రాలను సొంతంగా ఏర్పాటు చేస్తే ఏటా రూ.13 వేల కోట్ల ఆదాయం రానుందని, పీపీపీ పద్ధతిలో ఏటా రూ.431 కోట్లను రాయల్టీగా పొందవచ్చని అంచనా వేసింది.

జలాశయాలతో రూ.100 కోట్ల ఆదాయం

రాష్ట్రంలోని 16 జలాశయాలు 1,675 చ.కి.మీల ప్రాంతంలో విస్తరించి ఉండగా.. చ.కి.మీటర్కు 40 మెగావాట్ల సామర్థ్యం చొప్పున 10 శాతం విస్తీర్ణంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఒక మెగావాటికి రూ.5.5 కోట్లు చొప్పున 6,700 మెగావాట్లకు రూ.36,850 కోట్ల వ్యయం కానుంది. ఏటా 10వేల మిలియన్ యూనిట విద్యుత్ ఉత్పత్తి కానుండగా, రూ.3 వేల కోట్ల ఆదాయం రానుంది. జలాశయాలను అద్దెకు ఇచ్చినందుకు ప్రతి యూనిట్ 10 పైసలను రాయల్టీగా పొందినా ఏటా రూ.100 కోట్లను నీటిపారుదల శాఖ పొందవచ్చు. రాష్ట్రంలో 40 వేల కి.మీ సాగునీటి కాల్వలుండగా మరో 40 వేల కి.మీ కాల్వలు నిర్మాణంలో ఉన్నాయి. 8 వేల ఎకరాల్లోని కాల్వపై పీపీపీ పద్ధతిలో 2వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు రూ.9వేల కోట్ల వ్యయం కానుండగా,ఏటా 3,100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. యూనిట్ విద్యుత్‌ను రూ.2.5 చొప్పున విక్రయించినా కనీసం ఏడాదికి రూ.775 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రైవేటు డెవలపర్ల నుంచి యూనిట్‌కు 10 పైసలను రాయల్టీగా పొందినా ఏటా రూ.31 కోట్లను నీటిపారుదల శాఖ అర్జించవచ్చు.

పంప్డ్ స్టోరేజీతో రూ.300 కోట్ల రాయల్టీ 

ములుగు అడవుల్లో 3,960 మెగావాట్లు, నిర్మల్ అడవుల్లో 1,200 మెగావాట్లు, ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి వీలుంది. అక్కడి జలాశయాలను ఆధారం చేసుకుని 5 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. మెగావాట్‌కి రూ.6.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్ల చొప్పున రూ.35 వేల కోట్ల వ్యయం కానుంది. ఏటా 30,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుండగా, యూనిట్‌కి రూ.3 ధరతో ఏటా రూ.9,200 కోట్ల ఆదాయం రానుంది. యూనిటు 10 పైసలను ప్రైవేటు డెవలర్ల నుంచి రాయల్టీగా పొందినా ఏటా రూ.300 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News