న్యూఢిలీ: ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఆర్‌ఎస్‌ఎస్‌పై అభ్యంతరకర కార్టూన్లు వేసిన కార్టూనిస్టు హేమంత్ మాల్వియాకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మంగళవారం కోర్టు ఆదేశించింది.సోషల్ మీడియాలో మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై వివాదాస్పద కార్టూన్లు వేసిన హేమంత్ సాల్వియాకు రక్షణ కల్పిస్తున్నట్లు జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఒక వేళ మళ్లీ అదే రీతిలో కార్టూన్లను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లయితే ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా సోషల్ మీడియాలో కొందరు యూ ట్యూబర్లు, స్టాండప్ కమెడియన్లు, కళాకారులు ఇష్టానుసారం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పోస్టుల కట్టడికి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
సోషల్ మీడియాలో ఏం చేసినా, .. ఏం చెప్పినా చెల్లిపోతుందనే ధోరణి పలువురిలో కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై వేసిన కార్ట్టూన్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ న్యాయవాది,ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వినయ్ మిశ్రా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. మాలవ్యా సోషల్ మీడియాలో అభ్యంతరకర విషయాలను అప్‌లోడ్ చేయడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని జోషీ ఆరోపించారు. ఈ కేసులో రక్షణ కల్పించాలని కోరుతూ హేమంత్ మాలవ్యా మధ్యప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా న్యాయస్థానం దాన్ని తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.