‘కలర్ ఫొటో’ ఫేం సుహాస్ నటించిన చిత్రం ‘ఓ భామ.. అయ్యో రామ’. మాళవిక మనోజ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్ గోదల తెరకెక్కించాడు. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ: రామ్ (సుహాస్) చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. తండ్రికి (రవీంద్ర విజయ్ ) రామ్ అంటే గిట్టదు. తల్లి మరణించడంతో మేనమామ (అలీ) అతని బాధ్యత తీసుకుంటాడు. అక్కడి నుంచి రామ్‌కి ఏ లోటు లేకుండాచూసుకుంటాడు. రామ్ దర్శకుడు కావాలనేది అతని తల్లి కల. కానీ అతను సినిమాలకు దూరంగా ఉంటూ పెద్ద చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటాడు. అతని జీవితంలోకి సత్యభామ (మాళవిక మనోజ్) అనే అమ్మాయి రావడంతో తన జీవితం మారిపోతుంది. అమ్మ లేని లోటును సత్యభామ తీరుస్తుంది. ఆమె రాక అతనిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది. సినిమాలకు దూరంగా ఉండే అతను ఆ దిశగా అడుగులు వేయడానికి కారణమేంటి? సినిమా డైరెక్టర్ కావాలానే తల్లి కోరికకు అతను ఎందుకు దూరంగా ఉన్నాడు? రామ్, సత్యభామల ప్రేమ కథ సఫలమైందా, లేదా? అన్నది కథ.
కథనం, విశ్లేషణః హీరో హీరోయిన్, స్నేహితుల మధ్య సాగే సన్నివేశాలు రొటీన్‌గా సాగుతాయి. ఈ సినిమాలో ప్రధానంగా స్క్రిప్ట్ వర్క్ బాగాలేదు. కథనం ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. నెమ్మదిగా సాగుతూ ఎటెటో వెళ్లిపోతున్న భావన కలుగుతుంది. అనవసర సాగదీత, కొన్ని సన్నివేశాలు బాగా బోర్ తెప్పిస్తాయి. ఇక వీటితో పాటుగా సినిమాలో సరైన భావోద్వేగాలు కూడా లేవు. చాలా ఊహాజనిత కథనం మరో మైనస్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో సుహాస్ తన పాత్రకు కొంత మేరకు న్యాయం చేశాడు. సత్యభామ పాత్రలో మాళవిక మనోజ్ పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో కథకు తగ్గట్టుగా భావోద్వేగాలు తెరపై కనిపించలేదు. చివరికి ఈ సినిమా బోరింగ్ డ్రామాగా నిలిచింది.