మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి: కన్న కొడుకు తమను పట్టించుకోవడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఓ వృద్ధుడు పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన అధికారులు వెంటనే అతనిని కలెక్టర్ వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. వివరాల్లోకి వెళ్తే…జిల్లా లోని రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అజ్మీర విఠల్, అతని భార్య వీరవ్వ సోమవారం సిరిసిల్లలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొనేందుకు వచ్చారు. ఏమైందో ఏమో.. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును అజ్మీర విఠల్ కలెక్టర్ కార్యాలయంలో తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు వెంటనే అతనిని కలెక్టర్ వాహనంలోనే జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే తమ కుమారుడు నరేష్ తమను పోషించడం లేదని, ఇంట్లో నుండి బయటకు పంపి తమను చంపుతామని బెదిరిస్తున్నాడని అజ్మీర వీరవ్వ తెలిపింది. గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో తమ సమస్యను వెల్లడించినా తమకు సరైన న్యాయం జరగడం లేదని అందుకే తన భర్త విఠల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని వివరించింది. ఇక నైనా తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను వేడుకొంది.