ఆసియాకప్-2025 (Asia Cup-2025) సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఒమన్ కూడా ఈ టోర్నీలో పాల్గొనే జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఈ జట్టుకు భారత సంతతికి చెందిన ఓపెనింగ్ బ్యాటర్ జతీందర్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. జతీందర్ పంజాబ్‌లోని లుథియానాలో జన్మించాడు. ఇతనితో పాటు వినాయక్ శుక్లా, సమయ్ శ్రీవాస్తవ, ఆర్యన్ బిస్త్ తదితర భారత సంతతికి చెందిన ఆటగాళ్లు ఉన్నారు.
మరోవైపు సూఫియాన్ యూసుఫ్, జిక్రియా ఇస్లాం, ఫైజల్ షా, నదీం ఖాన్ కొత్తగా టి20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఒమన్ తొలిసారి ఆసియాకప్‌లో ఆడే అర్హత సాధించడం కొసమెరుపు. ఒమన్.. భారత్, పాకిస్థాన్, యుఎఇ ఉన్న గ్రూప్-ఎలో చోటు దక్కించుకుంది. సెప్టెంబర్ 12న ఒమన్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 15న యుఎఇతో, సెప్టెంబర్ 19న భారత్‌తో మ్యాచ్ ఆడుతుంది. ఒమన్ తొలిసారి ఆసియాకప్ (Asia Cup-2025) ఆడటంపై జట్టు ప్రధాన కోచ్ దులీప్ మెండిస్ హర్షం వ్యక్తం చేశారు. ఆసియాకప్‌లో ఆడటం తమ జట్టుకు లభించిన గొప్ప అవకాశమని.. గ్లోబల్ వేదికపై తమ జట్టు నైపుణ్యాలు ప్రదర్శించే అవకాశం రావడం సంతోషమని అన్నారు.
Also Read : జకోవిచ్ శుభారంభం