దేశంలో మావోయిస్టులకు ప్రభుత్వాలకు మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ఘర్షణ ఇటీవల ఒక కొత్త మలుపు తిరిగింది. ఈ మలుపు 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, అమిత్ షా హోం మంత్రిగా పరిపాలన ప్రారంభించిన దగ్గర నుంచే చూస్తున్నాం. ఇందుకు తాజా ఉదాహరణగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని కర్రెగుట్టల ప్రాంతంలో కేంద్ర బలగాలు పొరుగు రాష్ట్రమైన చత్తీస్‌గఢ్ పోలీసుల సహకారంతో సాగిస్తున్న వేటను చెప్పుకోవచ్చు. దాదాపు రెండు వారాలుగా కర్రెగుట్టల ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ (అంచున) సాగుతూ ఉన్నది. భౌగోళికంగా చూసినట్టయితే కర్రెగుట్టలు చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఇక్కడ వరుసగా దాదాపు 20 నుండి 30 వరకు గుట్టలున్నట్టు అంచనా. ఈ గుట్టల మీద మావోయిస్టులు కొన్ని దశాబ్దాలుగా గుహలు, సొరంగాలు ఏర్పరచుకొని బలమైన షెల్టర్లుగా వాడుకుంటున్నారు. ఈ ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున బాంబులు ప్రయోగించడం, డ్రోన్లు ఉపయోగించడం ఇతరత్రా సాంకేతికంగా, ఆధునికంగా చేతికందిన అన్ని మార్గాలనూ కేంద్ర బలగాలు ఉపయోగిస్తున్నాయి.
ఒక విశేషమేమిటంటే కర్రెగుట్టల చుట్టూ ఉన్న తెలంగాణ ప్రాంతంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వైపు గాని, అటు చత్తీస్‌గఢ్ ప్రాంతంలోని సుకుమా, బీజాపూర్ జిల్లాల వైపు గాని దరిదాపుల్లోకి కూడా కేంద్ర బలగాలు మీడియాను అనుమతించకపోవడంతో మీడియా పెద్ద ఎత్తున తనకు తోచిన కథనాలు రాయడం, ప్రసారం చేయడం వల్ల తీవ్ర గందరగోళం ఏర్పడింది. జరుగుతున్నది ప్రత్యక్షంగా చూసే వీలు లేని కారణంగా సత్యాలు రాసే, ప్రసారం చేసే అవకాశం లేకపోవడంతో బాటు, మావోయిస్టు పార్టీ పేరిట ఎవరో విడుదల చేసిన నకిలీ పత్రికా ప్రకటన ప్రచారం, ప్రసారం చేసి ప్రజలకు అసత్యం అందించి మీడియా నాలుక కరుచుకునే పరిస్థితి. ఎన్నో ఏళ్ళుగా తమకు రహస్య స్థావరాలుగా ఉన్న కర్రెగుట్టల మీద తాము ఉన్నామనే అర్థం వొచ్చే విధంగా పత్రికా ప్రకటన ఇచ్చి దాని ఉనికి మావోయిస్టు పార్టీ ఎందుకు బహిర్గతం చేసుకుంటుంది అన్న ఆలోచన మీడియా వారికి రాకపోవడం ఆశ్చర్యం. తరువాత ఒకటి రెండు రోజుల్లోనే మావోయిస్టు పార్టీ ఆ ప్రకటన తాము విడుదల చెయ్యలేదనీ, అది పోలీసులు సృష్టించిన నకిలీ ప్రకటన అని స్పష్టం కూడా చేసింది. ఇది మీడియా దృష్టికి పెద్దగా వచ్చినట్టు లేదు. ఒకటి రెండు మినహాయింపులు ఉంటే ఉండొచ్చు. కర్రెగుట్టల మీద కేంద్ర బలగాలు జరిపిన ఈ ఆపరేషన్ కగార్‌లో ముగ్గురు మహిళలు చనిపోయారు. వాళ్ళు మావోయిస్టు పార్టీకి చెందినవారని పోలీసులు, కాదు అమాయక ఆదివాసీ మహిళలని మావోయిస్టులు అంటున్నారు.
దాదాపు పది రోజుల తర్వాత కేంద్ర బలగాలు కర్రెగుట్టల మీద జాతీయ జెండా ఎగరేసి ఏదో శత్రురాజ్యం మీద యుద్ధం గెలిచి అక్కడి మన భూభాగాన్ని ఆక్రమించుకున్నట్టుగా హడావిడి చేసాయి. కర్రెగుట్టలు కేంద్ర బలగాల స్వాధీనం కావడం మామూలు విషయమేమీ కాదు. చాలా కాలంగా అవి మావోయిస్టులకు పెద్ద ఎత్తున ఆశ్రయంగా ఉపయోగపడుతూ వచ్చినవి అనే విషయం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అయితే కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్నంత మాత్రాన అయిపోలేదు. దాని వరుస వెంబడే 20 నుండి 30 వరకు గుట్టలు ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఏమున్నాయో రాష్ట్రాల పోలీసు బలగాలకే తెలియని స్థితి. కర్రెగుట్ట, దుర్గం గుట్ట, దోబికొండ, నీలం సారాయి వంటి కొన్ని గుట్టలను ఇప్పటికైతే గుర్తించారు. మొత్తం అన్నిటినీ గుర్తించి పర్యవేక్షించడానికి, మావోయిస్టుల ఆచూకీ తెలుసుకోవడానికి సిఆర్‌పిఎఫ్ బేస్ క్యాంప్ ఒకటి కర్రెగుట్టల దగ్గర ఏర్పాటు చేశారు. ఇప్పటికే చత్తీస్‌గఢ్ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రాణనష్టం చూసిన మావోయిస్టుల కదలికలు కేంద్ర ప్రభుత్వ ఈ చర్యతో ఇబ్బందికరంగా మారతాయనడంలో సందేహం లేదు. వేరు వేరు పేర్లతో అయినా దేశంలో కొన్ని రాష్ట్రాల్లో, అందునా దక్షిణాదిన నక్సలైట్ ఉద్యమం అర్ధశతాబ్దంగా ఆటుపోట్లను తట్టుకుంటూ, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సాగిన క్రమంలో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు రాష్ట్రాల శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యగానే చూస్తూ ఉండేది.
నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తరచూ కేంద్రానికి నక్సలైట్ ఉద్యమాన్ని ఎదుర్కోవడం కోసం, దాన్ని అణిచివేయడం కోసం అదనపు బలగాలు కావాలని, అదనపు నిధులు కేటాయించాలని పలుమార్లు విజ్ఞప్తులు చేయడం చూసాం. కేంద్ర ప్రభుత్వం, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఈ విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు చాలా కాలం లేవు. చాలా కొద్ది సందర్భాల్లో కేంద్రం ఈ విజ్ఞప్తుల్ని అరకొరగా అంగీకరించి సాయం చేసిన విషయం కూడా తెలిసిందే. గత పది పదకొండు సంవత్సరాల కాలంలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల మీద యుద్ధం ప్రకటించింది. ఈ మాటే ఎందుకనాల్సి వస్తున్నదంటే సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలుమార్లు లోక్‌సభ వేదికగా ఫలానా తేదీలోగా నక్సలైట్ ఉద్యమాన్ని తుదముట్టిస్తామని ప్రకటనలు చేశారు.
తాజాగా ఆయన ఇటీవలే లోక్‌సభలో 2026 మార్చి నెల నాటికి మొత్తం నక్సలైట్ ఉద్యమం తుడిచిపెట్టుకుపోతుందని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఆపరేషన్ కగార్ పేరిట నక్సలైట్ ఉద్యమాన్ని అంతమొందించేందుకు రాష్ట్రాల ప్రమేయం లేకుండా కేంద్ర బలగాలని దింపి దాడులకు ఉపక్రమించింది. ప్రధానంగా మావోయిస్టు ఉద్యమం బలంగా ఉన్న చత్తీస్‌గఢ్, దానికి ఆనుకొని ఉన్న తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో కేంద్ర బలగాలు విస్తృతంగా దాడులు జరిపి అనేక మందిని తుద ముట్టించాయి. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2025 మొదటి మూడు మాసాల్లోనే 140 మందికి పైగా మావోయిస్టులు చత్తీస్‌గఢ్‌లోనే భద్రతా దళాల చేతుల్లో హతమయ్యారు. వీరందరూ మావోయిస్టులని కేంద్ర ప్రభుత్వం లేదు ఇందులో అమాయకపు ఆదివాసీలు కూడా ఉన్నారని మావోయిస్టు ఉద్యమం వాదిస్తున్నాయి. అయితే ఇందులో మావోయిస్టు ముఖ్యులు కూడా కొందరు మరణించారు. 2024లో అయితే మొత్తం 235 మంది మరణించారు. కొన్ని సందర్భాలలో కేంద్ర భద్రత బలగాలకు సంబంధించిన వారు కూడా మావోయిస్టుల దాడిలో చనిపోయారు.
ఇదిలా ఉంటే కర్రెగుట్టలలో కగార్ మొదలుకాక ముందే మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముందుకొచ్చారు. బహుశా చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్ మరణాల కారణంగా కూడా మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అయితే ఈ ఆపరేషన్ అంతా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా చూస్తున్నందున రాష్ట్రాలు అశక్తంగా ఉండటం, మహా అయితే హింస ఆపండి, చర్చలు జరపండి అని కోరగలవు. కర్రెగుట్టలు తెలంగాణ భూభాగంలో ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ప్రమేయం గానీ, ఈ రాష్ట్ర పోలీసుల భాగస్వామ్యం గానీ లేకుండానే ఆపరేషన్ కగార్ సాగిపోతున్నది. అసలు సమాచారం అయినా ఇచ్చారా అన్నది అనుమానమే.
గత ఆదివారం నాడు ఓ పక్క ఆపరేషన్ కగార్ కర్రెగుట్టల మీద కొనసాగుతుండగానే పీస్ డైలాగ్ కమిటీ ప్రతినిధులు ప్రొఫెసర్ హరగోపాల్ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించి మావోయిస్టులను చర్చలకు పిలవాలని కోరినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. అదే సాయంత్రం భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖర్ రావు కూడా దీనికి అనుకూలంగా తీర్మానాన్ని ప్రతిపాదించి లక్షలాది మంది ప్రజలచేత హింస ఆగాలి, చర్చలు సాగాలి అని చెప్పించారు. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చిన ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో అధికారం కోసం పోటీపడుతున్న భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటికయితే ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా లేదు. నిజానికి మావోయిస్టులతో చర్చల ప్రతిపాదన ఇవాళ కొత్తగా వచ్చింది ఏమి కాదు ఒకటి కంటే ఎక్కువ సందర్భాలలోనే ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పటి హోం మంత్రి దేవేందర్ గౌడ్ అధ్యక్షతన సిబిఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు (అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో), అట్లాగే మరో మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారామ్‌లతో కలిసి చర్చల కోసం చంద్రబాబు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఒకటి ఏర్పాటు చేసింది.
అయితే ఆ ప్రయత్నం పెద్దగా ముందుకు సాగలేదు. తర్వాత రోజుల్లో నక్సలైట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీదనే అలిపిరిలో దాడి చేసిన విషయం తెలిసిందే. మరొక ప్రయత్నం కొంత పురోగతి సాధించింది 2004లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే. 2004 మే నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే చర్చలకు ఆహ్వానించడం, నక్సలైట్లు జూన్ మాసంలోనే సీజ్ ఫైర్ ప్రకటించడం, రెండు వైపులా కాల్పుల విరమణ జరగడం, అక్టోబర్ మాసంలో వివిధ నక్సలైట్ పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రభుత్వంతో చర్చలకు రావడం జరిగింది.
పీపుల్స్ వార్‌గా చర్చలకు ఆహ్వానం అందుకుని మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెంది ప్రభుత్వంతో చర్చలకు కూర్చోవడం విశేషం. చర్చలకు సంబంధించిన ప్రక్రియ సాగుతున్న కాలంలోనే సెప్టెంబర్ 21న సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనం అయి 2004 సెప్టెంబర్ 21న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)గా మారాయి. చర్చల కోసం బయటికి వచ్చి అక్టోబర్ 14వ తేదీ నాడు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇది అప్పటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆహ్వానం మేరకు చర్చల ప్రారంభానికి ముందు రోజు నా అధ్యక్షతన జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పార్టీ నాయకుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్‌కె) రాష్ట్ర ప్రభుత్వ మంజీరా గెస్ట్ హౌస్‌లో మావోయిస్టు పార్టీ అవతరణ గురించి ప్రకటించారు. అది అట్లా ఉంచితే అప్పుడు నక్సలైట్ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొన్ని రోజులు చర్చలు జరిగినప్పటికీ తర్వాత కాలంలో అది పెద్దగా ఫలితాలను ఏమీ ఇవ్వలేదు.
ఆనాటి చర్చల్లో పాల్గొన్న ఒక పార్టీ నాయకుడు రియాజ్ తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిన కొద్ది రోజులకు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఫలితం మాట ఎట్లా ఉన్నా ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఆ కొద్ది మాసాలు రెండు వైపులా కాల్పుల విరమణ కారణంగా హింస జరగలేదు, ప్రాణనష్టం కూడా నివారించడం వీలైంది. ఆనాటి ఆ చర్చలు జరగడానికి చాలా నేపథ్యం ఉంది. అప్పట్లో మన సమాజం గౌరవించే కొందరు పెద్దలు, మేధావులు పౌర స్పందన వేదిక పేరిట సీనియర్ ఐఎఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ నేతృత్వంలో ప్రముఖ పౌర హక్కుల న్యాయవాది కన్నాబిరాన్, ప్రముఖ సంపాదకులు పొత్తూరు వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ హరగోపాల్ వంటి వారు చేసిన సుదీర్ఘ కాలపు ప్రయత్నాల అనంతరం ఆ చర్చలు సాధ్యమయ్యాయి.
ఇప్పుడు కూడా మావోయిస్టు పార్టీ సీజ్ ఫైర్‌కు సిద్ధపడింది. చర్చలకు వస్తానంటున్నది. అధికార పక్షంతో సహా రాష్ట్రంలోని ప్రధాన పక్షాలన్నీ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎం ఇతర కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, మేధావులు హింస ఆగి శాంతి నెలకొనాలని కోరుతున్నారు. అట్లా కోరుతున్న వారిని అర్బన్ నక్సల్స్ అని ముద్ర వెయ్యకుండా, నక్సలైట్ ఉద్యమాన్ని తుదముట్టిస్తామని డెడ్ లైన్‌లను కాసేపు పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం చర్చల విషయంలో సీరియస్‌గా ఆలోచిస్తే మరింత హింసను నివారించే వీలు కలుగుతుంది. ఆ దిశగా ఆలోచించడానికి ఆపరేషన్ కగార్ సూత్రధారులు సిద్ధంగా ఉన్నారా అన్నది శేష ప్రశ్న.