న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడికి గట్టి బదులిస్తూ భారత బలగాలు ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించిన సరికొత్త వివరాలను ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ వెల్లడించారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సదస్సులో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత బలగాలు అత్యంత కచ్చితత్వంతో పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్ లోని లక్షాలను ఛేదించాయి. దాంతో దాయాది కాళ్లబేరానికి వచ్చింది. అందుకోసం వైమానికదళం (ఐఎఎఫ్) 50 కంటే తక్కువ ఆయుధాలనే ప్రయోగించిందని ఆయన వెల్లడించారు.
‘యుద్ధాన్ని ప్రారంభించడం సులభమే. ముగించడం అంత సులువైన పనికాదు. దానిని దృష్టిలో పెట్టుకొని మన బలగాలను సంసిద్ధంగా ఉంచాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా మోహరింపులు చేపట్టాం ” అని ఆయన వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంట నాలుగు రోజుల పాటు కచ్చితమైన లక్షాలతో చేసిన మిసైల్ దాడులతో మే 10న పాకిస్థాన్ సీజ్‌ఫైర్‌కు దిగొచ్చిందని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించిన దృశ్యాలతోపాటు మరికొన్ని కొత్త విజువల్స్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. ఏప్రిల్ 29న ఉగ్రలక్షాలను షార్ట్ లిస్ట్ చేసుకున్నామని చెప్పారు. మే 5న ఆపరేషన్ నిర్వహించాలనుకుంటున్న తేదీ, సమయం నిర్ణయమైందని చెప్పారు.