ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకుల మృతికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు పాక్ లోని టెర్రరిస్టుల క్యాంప్ లపై మిస్సైల్స్ తో విరుచుకుపడ్డాయి. మంగళవారం అర్థరాత్రి భారత సైన్యం.. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కరే-ఎ-తోయిబా (LeT), హిజ్బుల్ ముజాహిదీన్‌లతో సంబంధం ఉన్న 9 ఉగ్రస్థావరాలపై 25 నిమిషాల పాటు వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు మరణించినట్లు భారత అధికార వర్గాలు తెలిపాయి. తొమ్మిది ఉగ్రస్థావరాలను శాటిలైట్ ఫోటోలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఎంపిక చేసి దాడులు చేసినట్లు భారత త్రివిధ దళాలు వెల్లడించాయి.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి భారత ఆర్మీ.. దాడులు చేసి ప్రతీకారం తీర్చుకోవడంతో దేశవ్యాప్తంగా భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు భారత ఆర్మీకి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు, ఈ దాడులపై స్పందించిన పాక్.. సమయం చూసి భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది.