బీహార్ ఓటర్ల జాబితా సవరణ (సర్)పై నిరసనలు వరుసగా సోమవారం కూడా కొనసాగాయి. అసాధారణ రీతిలో పార్లమెంట్ భవన ఆవరణలో పలు ప్రతిపక్ష పార్టీలు సర్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగాయి.ఈ ప్రదర్శనలో ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్, ఎస్‌పి నాయకులు అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. సర్ కటౌట్లను చింపివేశారు. సర్‌పేరిట వెలిసిన చెత్త బుట్టల్లో ముక్కలు పడేశారు. దీనితో శుక్రవారం నాటి దృశ్యాలు ఇప్పుడు కూడా ఆవరణలో చోటుచేసుకున్నాయి. బీహార్‌లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ మిషతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏకంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుందని, ఎన్నికల సంఘం పావు అయిందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. సోనియా , రాహుల్, ప్రియాంక, ఖర్గే ,టిఎంసి ఎంపిలు డెరెక్ ఓ బ్రెయిన్ , డిఎంకె ఎంపి కనిమొళి ఇతరులు ఈ ప్రక్రియ ఉపసంహరణకు డిమాండ్ చేస్తూ నినాదాలకు దిగారు. వారికి ప్రతిపక్ష ఎంపీలంతా వంత పలికారు.
దీనితో సభా ప్రాంగణం దద్దరిల్లింది. సర్‌తో ప్రజాస్వామ్య హననం అంటూ భారీ స్థాయిలో కటౌట్లను పట్టుకుని ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శనకు దిగాయి. దీనితో భద్రతా సిబ్బంది అప్రమత్తం కావల్సి వచ్చింది. స్టాప్ సర్ అంటూ ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకుదిగడం ఇది ఐదోరోజు అయింది. పార్లమెంట్ మకరద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు గుమికూడారు. కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, ఆర్జేడీ, వామపక్షాల ఎంపిలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. దీనితో ఇండియా కూటమి సంఘటిత వైఖరి స్పష్టం అయింది. ఈ నిరసనలలో ఆప్ ఎంపిలు కన్పించలేదు. అణగారిన వర్గాల ఓటు హక్కును హరించివేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందని, దీనిని అడ్డుకుని తీరుతామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. పార్లమెంట్ ఉభయసభల్లోనే కాకుండా వెలుపల కూడా ప్రతిపక్షాలు తమ నిరసనలను ఉధృతం చేయడంతో సర్ వ్యవహారం ఇక ఎటు నుంచి ఎటు దారితీస్తుందనేది వెల్లడికాని పరిస్థితి ఏర్పడింది.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై ఆర్‌ఎస్‌ఎస్ బిజెపిల ఉమ్మడి మనువాద భావాల దాడికి అనుమతించేది లేదని విపక్షాలు స్పష్టం చేశాయి. సర్ ఓట్ల చోరీకి రూపొందించిన ప్రమాదకర దొడ్డిదారి. ప్రజాస్వామిక రాజ్యాంగ విలువలపై ప్రత్యక్ష దాడి అని రాహుల్ గాంధీ ఎంపిల ప్రదర్శన దశలో తెలిపారు. ప్రతిపక్షం అంతా సంఘటితంగా వ్యవహరించాలి. ఈ కుట్రను అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ ప్రక్రియను నిలిపివేసే వరకూ ప్రతిపక్షాల నిరసనలు ఆగబోవపి ఆయప ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించారు.