Thursday, May 8, 2025

పాక్ పై బద్ లా

- Advertisement -
- Advertisement -

42 మృతదేహాల గుర్తింపు పహల్గాంకు ప్రతీకారం తీర్చుకున్న భారత్ పాక్‌లోని నాలుగు, పివోకెలోని ఐదు ఉగ్రస్థావరాలు ధ్వసం
సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలోని బహవల్‌పూర్ జైషే స్థావరం నేలమట్టం జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10మంది మృతి అత్యంత ఖచ్చితత్వంతో లక్షాలను ఛేదించే స్కాల్ప్ క్రుజ్ మిస్సైల్, హామ్యర్ గైడెడ్ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడిన భారత బలగాలు ప్రధాని అధ్యక్షతన కేబినెట్ భేటీ జవాన్లకు సెల్యూట్ చేసిన మంత్రివర్గం రాష్ట్రపతికి ప్రధాని మోడీ నివేదన

న్యూఢిల్లీ : పహల్గాం దాడులకు భారత్ ప్రతీకారం చేసింది. పాకిస్తాన్ లోనూ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనూ తొమ్మిది టెర్రరిస్ట్ శిబిరాలపై 24 క్షిపణులను ప్రయోగించి నేలమట్టంచేసింది. 100 మందికి పైగా టెర్రరిస్ట్ లను మట్టుపెట్టింది. కేవలం 25 నిముషాలలో అల్లకల్లోలం సృష్టించి పాక్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. మే7న తెల్లవారుజామున 1.05 నిముషాలనుంచి 1.30 నిముషాలవరకూ భారతసైన్యం, వైమానికదళం సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ అన్న పేరుతో దాడుల పరంపర సాగించాయి. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ బుధవారం మీడియా సమావేశంలో ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 22న పహల్గాం లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా వ్యూహాత్మకంగా, దీటుగా, శతృదేశం దిమ్మతిరిగే విధంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వారు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ భారతదేశపు వ్యూహంలో మార్పును సూచిస్తోందని కల్నల్ ఖురేషి అన్నారు.

మూడు దశాబ్దాలుగా పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో ఉగ్రవాదుల రిక్రూట్ మెంట్ కేంద్రాలు, శిక్షణాకేంద్రాలు, లాంచ్ ప్యాడ్ లు ఏర్పాటు చేయడం ద్వారా, టెర్రరిస్ట్ లకు సదుపాయాలు కన్పిస్తూవచ్చింది. ఈ శిబిరాలను నేలమట్టం చేయడం ద్వారా భవిష్యత్ లో దాడులు చేసే అవకాశం లేకుండా చేసే ఉద్దేశం తోనే ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్లు కల్నల్ ఖురేషి తెలిపారు. పహల్గాం దాడి వంటి మరి కొన్ని దాడులు భారత్ పై జరిగే ప్రమాదం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు సూచించడంతో ఆ దాడులను నిరోధించేందుకు. బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ చేపట్టాం. సీమాంతర ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించు కోవడం మనహక్కు. ఆ హక్కునే వినియోగించుకున్నాం.

అత్యంత పకడ్బందీగా, బాధ్యతా యుతంగా, టెర్రరిస్ట్ శిబిరాలను, మౌలిక సదుపాయాలను సర్వనాశనం చేశామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. ముజఫరాబాద్, కోట్లి, బహవల్పూర్, రావల్ కోట్, చక్స్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్ లోని టెర్రరిస్ట్ స్థావరాలపై క్షిపణిదాడులు జరిగాయి. ఇవన్నీ ఉగ్రవాద శిబిరాల స్థావరాలని నిఘాసం సంస్థలు చాలా కాలంగా అనుమానిస్తున్నాయి. లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్ వంటి సంస్థలు ఇక్కడ తిష్టవేశాయని నమ్ముతున్నారు. ఈ రెండు సంస్థలు దశాబ్దాలుగా మనదేశంలో పలు దాడులకు పాల్పడ్డాయి. తొమ్మిది ప్రదేశాలలో ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉంటే, మరో నాలుగు పాక్ ప్రధాన భూభాగంలో ఉన్నాయి. ముఖ్యంగా బహవల్పూర్ జైషే మొహమ్మద్ కు పెట్టని కోట. ముజఫరాబాద్ , భీంబర్ పాక్ ఉగ్రవాదులు కశ్మీర్ లో చొరబడడానికి, ట్రాన్స్ పోర్ట్ , ఇతర సౌకర్యాలు కల్పించే లాజిస్టిక్ పాయింట్లుగా భారత భద్రతా సంస్థలు గుర్తించాయి.

భారత సైన్యం వైమానిక దళం సాగించిన ఆపరేషన్ సక్సెస్ అయిందని. క్షిపణులదాడితో నిర్దిష్ట లక్ష్యాలు సాధించాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. యుఏవి నిఘా కమాండ్ సెంటర్లు, శిక్షణా శిబిరాలు, ఆయుధ డంప్ లు, ఇతర సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి వెళ్లకుండా ఈ విసృ్తత ఆపరేషన్ నిర్వహించినట్లు ప్రకటించింది. క్షిపణుల దాడిలో 70 మంది టెర్రరిస్ట్ లు చనిపోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. భూమి మీదనుంచి, ఆకాశం నుంచి క్షిపణులు లక్ష్యాలను ఛేదించుకుంటూ సాగాయి. నిఘా డ్రోన్ ల ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణ కారణంగా పౌరులకు ప్రాణనష్టం కల్గించకుండా దాడులు నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లేజర్ – నిర్దేశిత క్షిపణులు, ఉపగ్రహ గ్లైడెడ్ గ్లైడ్ బాంబులు వంటి మందుగుండు సామగ్రిని అత్యంత కచ్చితంగా ప్రయోగించి జనావాసాలపై దాడులు జరగకుండా ఆపరేషన్ నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News