బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ సర్పంచులు, కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం గులాబీ కండువా కప్పుకున్నారు. బిఆర్ఎస్లో చేరిన వారిలో తనుగుల మాజీ సర్పంచ్ రామస్వామి, శంభునిపల్లి మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, పాపక్కపల్లి మాజీ సర్పంచ్ మహేందర్, శాయంపేట మాజీ సర్పంచ్ భద్రయ్య, నాగంపేట మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, రాచపల్లి సదానందం, జైద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత పాలనతో విసిగిపోయారని అన్నారు. ముఖ్యంగా రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
కెసిఆర్ పాలనలో తెలంగాణలో రామరాజ్యం నడిచిందని, కానీ ఇప్పుడు రాక్షస పాలన నడుస్తోందని విమర్శించారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలమై, దేశంలోనే అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గులాబీ కండువాలు కప్పుకున్న నాయకులు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగిందని అన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే తిరిగి కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్తుతో పాటు కనీస గౌరవం కూడా ఉండదని గ్రహించి, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్న బిఆర్ఎస్ పార్టీలో చేరామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్ రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.