Friday, May 2, 2025

ఇప్పటికీ దక్షిణకశ్మీర్ అడవుల్లో పహల్గామ్ హంతక టెర్రరిస్ట్ లు?

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో మారణహోమానికి పాల్పడి 26మందిని పొట్టన పెట్టుకున్న నలుగురు టెర్రరిస్ట్ లు ఇప్పటికీ దక్షిణకశ్మీర్ లోని దట్టమైన అడవుల్లో తలదాచుకుని ఉంటారని ఎన్ ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. వారం రోజులుగా ఒకపక్క సైన్యం, పోలీసులు మరో పక్క ఎన్ ఐఏ బృందాలు గాలిస్తున్నా వారి ఆచూకీ దొరకలేదు. టెర్రరిస్ట్ ల వద్ద తగినంత ఆహారం, నీరు,దాగేందుకు తగిన వస్తువులు కలిగి ఉండి ఉండవచ్చు. అందుకే ఇప్పటి వరకూ వారు తప్పించుకున్నారని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని భారత ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాగా, టెర్రరిస్ట్ లు 8,9 రోజులుగా
గుట్టుగా దాగి ఉండేందుకు అవసరమైన లాజిస్టికల్ మద్దతు కూడా పాక్ నుంచి అందిఉండవచ్చునని భావిస్తున్నారు. పహల్గామ్ దాడి లక్ష్యంగా మనదేశంలో ప్రవేశించిన టెర్రరిస్ట్ లు పర్యాటక ప్రదేశం బైసారన్ లోయలో ఏప్రిల్ 22న దాడికి కనీసం 48 గంటలముందే అక్కడికి చేరుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది.

వారు ఆరు, బేతాబ్ లోయతో సహ మరో నాలుగు ప్రాంతాలలో మొదట దాడికి అవసరమైన రెక్కీ నిర్వహించినట్లు వారికి తోడ్పడిన ఉగ్రవాద సానుభూతిపరులు విచారణలో తెలిపినట్లు ఎన్‌ఐఏ వర్గాలు వివరించాయి. కానీ, అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో ఉగ్రవాదులు చివరిగా బైసారన్ ను ఎంచుకున్నారు. బైసారన్ లో భద్రతా లోపాన్ని ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించాయి. టెర్రరిస్ట్ ల వద్ద అత్యాధునిక కమ్యునికేషన్ పరికరాలు ఉన్నాయని నిఘాసంస్థలు భావిస్తున్నారు. అలాంటి పరికరాలకు సిమ్ కార్డులు అవసరం ఉండదు. స్వల్ప- శ్రేణి ఎన్ క్రిప్టెడ్ ట్రాన్స్ మిషన్ ను కలిగిఉంటాయి. వాటిని ట్రేస్ చేయడం కష్టమే. ఏప్రిల్ 22న దాడి ప్రారంభించేవరకూ టెర్రరిస్ట్ లు మూడు సాటిలైట్ ఫోన్లను ఉపయోగించారు. ఎక్కడ సెక్యురిటీ సిబ్బంది ఉన్నారో పరస్పరం తెలుపుకునేందుకు వాటిని ఉపయోగించినట్లు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News