Wednesday, May 28, 2025

ఉగ్ర రక్కసిపై గళమెత్తిన కశ్మీర్.. ఆరేళ్లలో తొలిసారి బంద్

- Advertisement -
- Advertisement -

పహల్గాంలో ఉగ్రదాడితో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో శ్రీనగర్ సహా స్థానికంగా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాజా సంఘటనతో కశ్మీరీలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. అటు నేషనల్ కాన్ఫరెన్స్ కూడా లాల్‌చౌక్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టింది. రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల ప్రజలు ఉగ్రచర్యలను ఖండిస్తూ నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీనగర్ సహా అనేక చోట్ల బంద్ పాటించారు. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీశారని ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటీవలి కాలంలో దుకాణాలు మూతపడటం ఇదే తొలిసారి. ఆగస్టు 2019 కు ముందు ఇక్కడ ఇటువంటివి సర్వసాధారణం కాగా, ఆర్టికల్ 370 రద్దు తరువాత , గత ఆరేళ్లలో కశ్మీర్‌లో బంద్ పాటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ప్రపంచానికి సందేశం చాటేందుకే…
ఉత్తర కశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారాలో నిరసనలు చేపట్టారు. ఉగ్రచర్యకు వ్యతిరేకంగా దక్షిణ కశ్మీర్ లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. 2016లో హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ హతమైన తరువాత ఇదే విధంగా స్థానికులు వీధుల్లోకి వచ్చారు. కశ్మీరీలు ఉగ్రవాదంతో లేరనే సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకే ఈ నిరసనలు చేస్తున్నామని , పర్యాటకులపై దాడిని ఖండిస్తున్నామని స్థానిక సామాజిక కార్యకర్త తౌసీఫ్ అహ్మద్ పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు జమ్ముకశ్మీర్ ప్రజల మేలు కోరే వారు కాదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహ్‌దీ పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకొని చట్టం ముందు నిలబెడతామన్నారు. రాంబన్ జిల్లాలోనూ నిరసనలు జరిగాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన సంఘటనలతో విలవిల్లాడుతున్నప్పటికీ ఉగ్రదాడికి నిరసనగా బంద్ పాటించి శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. ఈ పట్టణ చరిత్రలో తొలిసారిగా హిందూ, ముస్లిం వర్గాలు కలిపి ఉగ్రచర్యకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News