Sunday, May 4, 2025

కొలంబో ఎయిర్‌పోర్టులో పహల్గాం టెర్రరిస్టులు?… తనిఖీలు

- Advertisement -
- Advertisement -

కొలంబో : శ్రీలంకలోని కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉగ్రవాదుల కలకలం చెలరేగింది. పహల్గాం ఉగ్రదాడిలో అనుమానితులు ఆరుగురు కొలంబో ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు భారతీయ ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దీనితో ఈ విషయాన్ని ఉన్నతాధికారులు శ్రీలంక హోంశాఖకు, విమానాఎయిర్‌పోరశ్రయ అధికారులకు తెలియచేశారు. దీనితో ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్న యుఎల్ 122 విమానం టేకాఫ్‌ను నిలిపివేసి , క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదుల ఉనికి సమాచారం , పెద్ద ఎత్తున తనిఖీల హడావిడితో విమానాశ్రయంలో భయాందోళనలు నెలకొన్నాయి. పహల్గాం దాడికి బాధ్యులని అనుమానిస్తున్న వారి ఫోటోలు ఇతర వివరాలతో ఇటీవలే భారతీయ దర్యాప్తు సంస్థలు వెలువరించాయి.

పైగా ఎక్కడికక్కడ వీరి సంచారం గురించి తమ అంతర్గత వర్గాల ద్వారా ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఉగ్రవాదుల పోలికలతో ఉన్నవారు కొలంబో ఎయిర్‌పోర్టులో ఈ సంబంధిత విమానంలో వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం అందడంతో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. విమానంలో నుంచి ప్రయాణికులను దింపివేసి, వారిని ఒక్క దగ్గర చేర్చి వారి పూర్వాపరాలను తెలుసుకుని, ఉగ్రవాదులు ఎవరైనా ఉన్నదీ లేనిది తెలుసుకున్నారు. ఉదయం 11.59 ప్రాంతంలో ఇక్కడి బండార్‌నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఉగ్ర భయాలు నెలకొనడంతో సర్వత్రా ప్రకంపనలు చెలరేగాయి. ఎయిర్‌పోర్టు భద్రతా బలగాలు, శ్రీలంక వైమానిక దళం , స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు, వెంటనే సంయుక్త గాలింపు చర్యలు చేపట్టారని అధికారులు తెలిపారు. గంటల కొద్ది సోదాలు తనిఖీలు జరిగినా ఒక్క ఉగ్రవాది కూడా ఉన్నట్లు నిర్థారించలేకపొయ్యారు. అంతా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత విమానాల రాకపోకలకు అనుమతి నిచ్చారు. చెన్నై ఎరియా కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులకు అలర్ట్ అందింది. చెన్నై నుంచి విమానం కొలంబోకు చేరుకోగానే నిలిపివేసి తనిఖీలు నిర్వహించారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News